Monday, June 9, 2025
E-PAPER
Homeమానవిఅమ్మలే రోల్ మోడల్...

అమ్మలే రోల్ మోడల్…

- Advertisement -

మహిళలు తమను తాము నిరూపించుకోవడం కోసం ఎంతో కష్టపడతారు. అంతకు మించి ఉత్సాహంగా పని చేస్తారు. అయితే పెండ్లయి పిల్లలు పుట్టిన తర్వాత పరిస్థితి మొత్తం తారుమారు అవుతుంది. ఏదో సాధించాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు మెటర్నటీ తర్వాత బాధ్యతల దృష్ట్యా తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ఒక్కోసారి వర్క్‌ లైఫ్‌కు పూర్తిగా దూరమవుతారు. అయితే మరికొంతమంది మహిళలు మాత్రం ఉద్యోగంపై ఉన్న మక్కువను వదులుకోలేకో, లేదంటే తమ ఆర్థిక స్థితిగతుల రీత్యానో… ఇలా కారణమేదైనా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇలా ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలకు చక్కటి మార్గదర్శకులుగా ఉండే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
ఉద్యోగం చేయకుండా ఇంటికి పరిమితమైన తల్లుల కంటే పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగాన్ని కొనసాగించే అమ్మలే తమ పిల్లలకు రోల్‌ మోడల్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అది కూడా అబ్బాయి కంటే అమ్మాయిలపైనే వర్కింగ్‌ మదర్స్‌ ప్రభావం ఎక్కువట.
బద్దలు కొట్టాలని
పిల్లలు అన్ని విషయాలు నేర్చుకునేది తమ తల్లిదండ్రుల నుంచే. అయితే ఆడవారు తమ నైపుణ్యాలతో అందనంత ఎత్తుకు ఎదుగుతున్న ఈ రోజుల్లోనూ కొన్ని చోట్ల మహిళలను ఎదగనివ్వకుండా చేస్తున్నారు. దీనికి మూసధోరణలే కారణంగా చెప్పుకోవచ్చు. వీటిని బద్దలుకొట్టాలనే విషయాన్ని అమ్మాయిలు ఎదిగే క్రమంలో ఉద్యోగం చేస్తున్న తమ తల్లుల్ని చూసే నేర్చుకుంటారు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి
‘ఉద్యోగం చేసే అమ్మలు.. తమ కూతుళ్లపై ఎంత వరకు ప్రభావం చూపుతున్నారు’ అనే అంశంపై హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది ఉద్యోగినుల కూతుళ్లు ఉన్నత విద్యార్హతలతో, మంచి ఉద్యోగం చేస్తూ, ఎక్కువ సంపాదిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. కాబట్టి వర్కింగ్‌ మదర్స్‌ ఇలా కెరీర్‌ విషయంలోనూ తమ కూతుళ్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలకు చక్కటి కెరీర్‌ గైడెన్స్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
అబ్బాయిల్లోనూ మార్పు
అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఉద్యోగం చేసే తమ తల్లుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి, వంట చేసి, పిల్లల్ని రెడీ చేసి, వారికి బాక్సులు సర్దడం… ఇలా రోజూ తల్లి చేసే పనుల్ని దగ్గర్నుంచి గమనిస్తుంటారు పిల్లలు. ఇలాంటప్పుడు కొన్ని పనుల్లో పిల్లలు తల్లికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఇలా చిన్నతనం నుంచే ఇంటి పనులు చేయాలనే బాధ్యత వారికి అలవడుతుంది. ఆ తర్వాత ఇదే పద్ధతిని అబ్బాయిలు పెళ్లయ్యాక కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది.
సానుకూల ప్రభావం
ఉద్యోగం చేసే భార్యకు ఇంటి పనుల్లో సహాయపడడం, పిల్లల ఆలనా పాలనా బాధ్యతల్ని భార్యతో పాటు సమానంగా పంచుకోవడం వంటికి చేస్తారు. ఈ విషయం కూడా పలు పరిశోధనల ద్వారా నిరూపితమైంది. ఉద్యోగం చేసే తల్లిని చూస్తూ పెరిగిన కొడుకులు, తమ భార్యలకు ఇంటి పనుల్లో సహాయపడతారని, పుట్టే పిల్లల బాధ్యతల్ని చూసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా తల్లులు కొడుకులపై సానుకూల ప్రభావం చూపడం మాత్రమే కాదు… ఇలాంటి పరిణామాలు లింగ సమానత్వం సాధించేందుకు సైతం దోహదం చేస్తాయి. అలాగే ఉద్యోగం చేసే తల్లులకు ప్రతి క్షణం ఎంతో విలువైనది. ఎందుకంటే ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు బాధ్యతలతో పాటు పిల్లల్ని చూసుకోవడానికి కూడా సమానంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇందులోనూ వర్కింగ్‌ మదర్స్‌ సక్సెస్‌ సాధించడంతో తమ తల్లుల్ని చూసి వారి పిల్లలకూ క్రమశిక్షణ, సమయ పాలన అలవడుతాయి.
అనవసర ఆలోచనలురావు
ఇంట్లో ఉండి అనవసర విషయాలకు ఆందోళన చెందుతూ, తమ ఒత్తిళ్లను, చికాకును పిల్లలపై రుద్దే తల్లుల కంటే.. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎలాంటి చీకూ చింత లేకుండా పిల్లలతో గడిపే తల్లులే ఎక్కువ సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో రుజువైంది. చాలా మంది ఉద్యోగినుల్లో అటు ఆఫీసు పనులు, ఇటు ఇంటి పనులు, పిల్లలకు సమయాన్ని కేటాయించడం తప్ప మరే అనవసర ఆలోచనలు మదిలో మెదిలే అవకాశమే ఉండదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దాన్ని స్వయంగా పరిష్కరించుకోవడం లేదంటే కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడంలోనూ ఉద్యోగం చేసే తల్లులు నేర్పు ప్రదర్శిస్తుంటారు. కాబట్టి సమస్యలను ఎదిరించే నేర్పరితనం, సంతోషకరమైన వాతావరణం… వంటివన్నీ ఉద్యోగం చేసే తల్లుల పిల్లలపై సానుకూల ప్రభావం చూపు తాయి. ఓ రకంగా ఇది తల్లుల నుంచి పిల్లలు నేర్చుకునే ప్లస్‌ పాయింట్‌ అని చెప్పుకోవచ్చు.
ఆర్థిక స్వాతంత్య్రం
చాలా మంది మహిళలు ఉద్యోగం చేయడానికి ఆర్థిక స్వాతంత్య్రం ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. మంచి చదువున్నా… ఇంకా ఇతరులపై ఆధారపడటం ఏంటని భావించి, తమ చదువు, నైపుణ్యాలకు తగినట్టు ఆర్జిస్తూ ఆర్థికంగా పటిష్టంగా నిలుస్తున్నారు నేటి మహిళలు. అంతేకాదు… తమ పిల్లలకు పెట్టే కొన్ని ఖర్చుల విషయంలోనూ తామే స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. తమ పిల్లలకు కావాల్సింది కొనిస్తున్నారు. ఇలా తల్లులు తమ కోసం చేస్తోన్న ఈ పనుల్ని, ఆర్థిక స్వేచ్ఛని దగ్గర్నుంచి గమనించే పిల్లలు చదువులో, ఆ తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. తద్వారా వారు ఉన్నత చదువులు చదివి తామూ ఆర్థికంగా బలంగా ఉండాలన్న తాపత్రయంతో ముందుకు సాగుతారని అధ్యయన సారాంశం. కాబట్టి ఇలా ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -