Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅభిశంసన తప్పించుకోవాలంటే...రాజీనామా చేయాల్సిందే

అభిశంసన తప్పించుకోవాలంటే…రాజీనామా చేయాల్సిందే

- Advertisement -

జస్టిస్‌ వర్మకు వేరే దారే లేదు
న్యూఢిల్లీ :
పార్లమెంట్‌ ద్వారా అభిశంసన ముప్పును తప్పించుకోవాలంటే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తన పదవికి రాజీనామా చేయక తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్ట్‌ జడ్జి జస్టిస్‌ వర్మను పదవి నుండి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జస్టిస్‌ వర్మ ఉభయ సభలలో ఏదో ఒక సభ ముందుకు వచ్చి తన వాదనను వినిపించాల్సి ఉంటుంది. అయితే దానికి ముందే పదవి నుండి వైదొలుగుతున్నానని ఆయన ప్రకటించవచ్చునని, ఆ మౌఖిక ప్రకటననే రాజీనామాగా భావిస్తారని న్యాయ నిపుణులు తెలిపారు. రాజీనామా చేయాలని జస్టిస్‌ వర్మ నిర్ణయించుకుంటే రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తికి లభించినట్లుగానే ఆయనకు పెన్షన్‌, ఇతర ప్రయోజనాలు వస్తాయి. ఒకవేళ పార్లమెంటే ఆయనను తొలగిస్తే ఆయనకు అలాంటి ప్రయోజనాలేవీ లభించవు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 217 ప్రకారం పదవి నుండి వైదొలుగుతున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్రపతికి లేఖ రాయవచ్చు. న్యాయమూర్తి చేసే రాజీనామాకు ఎవరి ఆమోదం అవసరం లేదు. రాజీనామా లేఖ ఉంటే సరిపోతుంది. తాను పదవి నుండి వైదొలిగే తేదీని న్యాయమూర్తే తెలియజేయవచ్చు. అలాంటప్పుడు ఆ తేదీకి ముందు న్యాయమూర్తి తన రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది.
జస్టిస్‌ వర్మ నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు కన్పించిన నేపథ్యంలో ఆయనను తొలగించాల్సిందిగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాశారు. పదవికి రాజీనామా చేయాల్సిందిగా అంతకుముందు జస్టిస్‌ వర్మను ఖన్నా కోరగా ఆయన నిరాకరించారు. కాగా అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభలలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో కనీసం యాభై మంది సభ్యులు తీర్మానంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో తీర్మానానికి వంద మంది మద్దతు అవసరం. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభాపతి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. తొలగింపునకు కారణాలపై దర్యాప్తు చేయాలని కోరతారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ కోవిదుడు సభ్యులుగా ఉంటారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img