Tuesday, July 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదేశభక్తి పేర సైనికీకరణ

దేశభక్తి పేర సైనికీకరణ

- Advertisement -

పసి పిల్లల మొదళ్లను ప్రయోగశాలగా మార్చ చూస్తున్నారా? భావి తరాలపై యుద్దోన్మోదాన్ని రుద్దజూస్తున్నారా? తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే ఈ అనుమానాలు రాక మానవు. బీజేపీ ఏలుబడిలో ఉన్న ఆ రాష్ట్రం ఈ ఏడాది పాఠశాల విద్యలో కొత్త పధకాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులకు ప్రాథమిక స్థాయినుండే సైనిక శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణ కోసం రెండున్నర లక్షల మంది మాజీ సైనికులను కేటాయించనున్నట్టు, దశల వారీగా దీన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు.
వాస్తవానికి బాల్యం అంటే కల్లాకపటం ఎరుగని వయసు. కేరింతలు కొడుతూ, హాయిగా ఆడుతూ, పాడుతూ, చదువుకుంటూ గడపాల్సిన సమయం. అలాంటి పిల్లలకు సైనిక శిక్షణ, శత్రు సంహారం, జాతీయ వాదం అంటూ నూరిపోయడం, వారి పసి మనసులో యుద్దోన్మాదాన్ని నాటే ప్రయత్నాలు ప్రమాదకరం. వారి మానసిక, మేధో వికాసానికి ఇది ఎంతో హానికరం. చిన్న వయసులోనే పిల్లలకు దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాలను పెంపొందిస్తామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందిగానీ దీని వెనుక ఉద్దేశం గగుర్పాటుకు గురిచేస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను అమలు చేసే లక్ష్యమేదైనా ఉందా అని అనిపిస్తోంది. ఈ వయసులో పిల్లలకు సృజనాత్మకత, ఆలోచించే సామర్థ్యం, ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించాలి. కానీ ఈ సైనిక శిక్షణ వారిలో గుర్తింపు, గుడ్డి విధేయతను అలవర్చుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఒకపక్క మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో అల్లాడుతున్నాయి. ఏఎస్‌ఆర్‌ఈ నివేదిక ప్రకారం అక్కడి విద్యా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పదేండ్ల నుండి అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా రంగానికి నిధుల కొరత తీవ్రంగా ఉంది. కార్పొరేట్‌ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు విద్యకు దూరమై బాలకార్మికులుగా మారుతు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లిస్తే విద్యా వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకోవడం ఖాయం.
ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఇలాగే కునారిల్లు తోంది. ఏడాదికేడాది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోతోంది. దీన్ని బట్టి బీజేపీ ప్రభుత్వం విద్యను దీర్ఘకాలిక దృష్టితో చూడడం లేదనేది స్పష్టం. విద్యా రంగంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా, వాటిని పరిష్కరించ కుండా మహారాష్ట్రలో ఇప్పుడు సైనిక శిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో దేశం యావత్తూ అర్థం చేసుకుంటోంది. నిజానికి విద్యా వ్యవస్థలో ఇలాంటి కీలకమైన మార్పులు తెచ్చే ముందు విసృతమైన చర్చ జరగాల్సి వుంది. ఇవేవీ చేయకుండా అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అత్యంత వేగంగా అమలు చేసేందుకు పూనుకుంటోంది.
ముఖ్యంగా ఈ విధానం ప్రధానమంత్రి కార్యాలయం గతంలో ప్రతిపాదించిన సైనిక్‌ స్కూల్‌ మోడల్‌కు చాలా దగ్గరగా ఉంది. రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ సంస్థ నివేదిక ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 67 శాతం సైనిక్‌ సూళ్లను సంఫ్‌ు పరివార్‌, బీజేపీ నాయకులు, వారి అనుంగు మిత్రులకు అప్పగించింది. వారు ఆ పాఠశా లల్లో మతోన్మాద పాఠాలను నిర్విరామంగా బోధిస్తున్నారు. మొదటి నుండి విద్యను కాషాయీకరించడం ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. ఈ విద్యా విధానం సమాజంలో మానవీయతను దూరం చేసి సైనికీకరణను పెంపొందించే ప్రమాదం వుంది. ఇవేవీ పట్టని కాషాయ దళం తమ లక్ష్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకునేందుకు ముందుగా తమకు అనుకూలమైన రాష్ట్రాలను వాడుకుంటున్నది.
ఏది ఏమైనా విద్యా రంగంలో సైనిక శిక్షణ విద్యా వ్యవస్థలో అనేక కొత్త సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముంది. విద్యావేత్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. దేశభక్తి పేరుతో బాల్యాన్ని సైనికీకరించే ప్రయత్నంలో భాగమే ఇదని విమర్శిస్తున్నారు. శత్రువుపై పోరాడాలి అనే భావన వారి మనసులో అనవసరపు భయాన్ని కలిగించే అవకాశమూ లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ఇది వారి సున్నితమైన మనసును దెబ్బతీసి, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. ముమ్మాటికీ ఇది పిల్లల స్వేచ్ఛను హననం చేయడమే. కీలకమైన విద్యారంగంలో ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తాయి. అన్నింటికీ మించి పిల్లల భవితపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. కనుక ఈ కొత్త విధానంపై విస్తృతమైన చర్చలు జరగాలి. మేధావులు, విద్యావేత్తలు, మానసిక నిపుణుల అభిప్రాయాలు తీసుకొని అప్పుడు ఓ నిర్ణయానికి రావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -