Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమధ్యవర్తిత్వాన్ని అంగీకరించం

మధ్యవర్తిత్వాన్ని అంగీకరించం

- Advertisement -

– సైనిక చర్చల కారణంగానే కాల్పుల విరమణ
– ట్రంప్‌నకు స్పష్టం చేసిన మోడీ
న్యూఢిల్లీ:
అమెరికా మధ్యవర్తిత్వం కారణంగానే భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ జరిగిందన్న వాదనను ప్రధాని నరేంద్ర మోడీ తోసిపుచ్చారు. ఇరు దేశాల సైన్యం మధ్య నేరుగా జరిగిన చర్చలే కాల్పుల విరమణకు కారణమనీ, అమెరికా మధ్యవర్తిత్వం కాదని తేల్చిచెప్పారు. వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో టెలిఫోన్‌లో సంభాషించారని సీనియర్‌ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. కెనడాలో జరిగిన జీ-7 దేశాల సదస్సు సందర్భంగా మోడీ ఫోన్‌లో ట్రంప్‌తో మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత వీరిద్దరూ సంభాషించుకోవడం ఇదే మొదటిసారి. ‘భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కానీ, భారత్‌-పాకిస్తాన్‌ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంపై కానీ ఏ దశలోనూ చర్చలు జరగలేదని ట్రంప్‌తో మోడీ స్పష్టంగా చెప్పారు’ అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి ఒక ప్రకటనలో తెలిపారు. సైనిక చర్య నిలిపివేతపై రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా చర్చలు జరిగాయని, పాకిస్తాన్‌ కోరికపై అధికారులు పరస్పరం సంప్రదింపులు జరిపారని వివరించారు. జీ-7 సదస్సు సందర్భంగానే ఇరువురు నేతలు కలవాల్సి ఉన్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ట్రంప్‌ ఒక రోజు ముందే కెనడా నుంచి బయలుదేరారని మిస్రి చెప్పారు. అయితే మోడీ-ట్రంప్‌ టెలిఫోన్‌ సంభాషణపై శ్వేతసౌధం ఇప్పటి వరకూ స్పందించలేదు. ‘కెనడా నుంచి తిరిగి వచ్చేటప్పుడు అమెరికాలో ఆగగలరా అని మోడీని ట్రంప్‌ అడిగారు. కానీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఆగలేనని మోడీ జవాబిచ్చారు. క్వాడ్‌ గ్రూప్‌ నేతల సదస్సు సందర్భంగా భారత్‌లో పర్యటించాలని ట్రంప్‌ను మోడీ ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించారు’ విదేశాంగ కార్యదర్శి తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad