– ధర్నాచౌక్ వద్ద మహాదీక్షలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
ఓబీసీ రిజర్వేషన్లు 42 శాతం తక్షణ అమలుకు యుద్ధ కార్యాచరణ చర్యలు చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహా దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీలను మోసం చేస్తున్నారని, రాహుల్ గాంధీ ఓసీ అయినప్పటికీ బీసీల కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. 2029 జనరల్ అసెంబ్లీ ఎన్నికల లోపు కులాల వారీగా జనగణన పూర్తి చేయాలని, కులగణన ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే శ్రీలంక, బంగ్లాదేశ్ మాదిరిగా ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ కార్యాచరణ చేపట్టాలని లేకుంటే, రాష్ట్రవ్యాప్త దీక్షలు చేపడుతామని అన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ది కోసం కాకుండా బీసీల ప్రధాన డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి, కేంద్ర ప్రభుత్వ రాజకీయ లబ్ది వైఖరి తక్షణమే విడనాడాలని, లేనిపక్షంలో తాము చేపట్టే ఉద్యమ కార్యాచరణ, ప్రజాభిప్రాయానికి బాధ్యులవుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు పోదామని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వినరుకుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ, నందగోపాల్ సుధాకర్, జగదీష్ యాదవ్, సతీష్, వంశీకృష్ణ, ఉదరు, నరహరి, నాగుల శ్రీనివాస్, చెన్నా రాములు, సరోజా రజిని, విమల, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES