Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికాకు బ్లాక్‌బాక్స్‌?

అమెరికాకు బ్లాక్‌బాక్స్‌?

- Advertisement -

– తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
– అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై సంబంధిత వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ:
అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ను అమెరికాకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈనెల 12న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం కుప్పకూలి ప్రమాదం జరిగిన ఘటనలో ‘బ్లాక్‌ బాక్స్‌’ దెబ్బతిన్న విషయం విదితమే. దీనికి సంబంధించి బ్లాక్‌బాక్స్‌ను అమెరికాకు పంపాల్సి రావచ్చనీ, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. వాస్తవానికి ఒక విమాన ప్రమాదం జరిగినప్పుడు బ్లాక్‌ బాక్స్‌ కీలకంగా మారుతుంది. బ్లాక్‌ బాక్స్‌ నిజానికి రెండు పరికరాలు. ఒకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌), ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (ఎఫ్‌డీఆర్‌). కూలిపోయిన ఎయిరిండియా విమానం నుంచి స్వాధీనం చేసుకున్న ‘బ్లాక్‌ బాక్స్‌’ను వాషింగ్టన్‌ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు తనిఖీ కోసం పంపనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. న్యూఢిల్లీలోని ఉడాన్‌ భవన్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ)లో అత్యాధునిక డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ ప్రయోగశాలలను కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఏప్రిల్‌ 9న ప్రారంభించారు. అయితే, కొన్ని రోజుల్లోనే ఈ విమాన ప్రమాద ఘటన జరగటం, బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపించటంపై తర్జనభర్జనలు పడటం గమనార్హం. కాగా, సీవీఆర్‌ 25 గంటల వరకు కాక్‌పిట్‌ సంభాషణలు, శబ్దం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో రేడియో కాల్‌లు, కొత్త విమాన మోడళ్లతో వినిపించే హెచ్చరికలను సంగ్రహిస్తుంది. ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించటానికి అధికారులు విమానం చివరి సెకన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ప్రమాదానికి ముందు అహ్మదాబాద్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు వచ్చిన డిస్ట్రెస్‌ కాల్‌లోని విషయాలను సీవీఆర్‌ నిర్ధారిస్తుందని భావిస్తున్నారు. కెప్టెన్‌ సభర్వాల్‌, ఫస్ట్‌ ఆఫీసర్‌ క్లైవ్‌ కుందర్‌ మధ్య జరిగిన కాక్‌పిట్‌ చర్చలను, వారి పరిస్థితుల అవగాహన, అలారాలకు ప్రతిస్పందన, చివరి సెకన్లలో తీసుకున్న చర్యలను కూడా సీవీఆర్‌ బహిర్గతం చేస్తుందని విశ్వసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -