– ఎంపీలు ,కేంద్ర మంత్రులు తలోమాట
– ప్రశ్నార్థకంలో రాష్ట్ర ప్రయోజనాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై బీజేపీ ద్వంద్వ విధానం అవలంబిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఆరోపణలు, విమర్శలను తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రధానంగా గోదావరి బేసిన్‌లో ఏపీ తాజాగా ప్రతిపాదించిన బనకచర్లతోపాటు కాళేశ్వరం విషయంలో తెలంగాణ బీజేపీ విధానం రాష్ట్ర సాగునీటి అవసరాలకు ప్రతిబంధకం మారింది. తమ విధానం ఒక్కటేనంటూ బీరాలు పోతున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి, తాకట్టు పెడుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, సీఆర్ పాటిల్ ఏదంటే అదేనని అబి óప్రాయపడుతున్నారు. నిజానికి తెలంగాణ సాగునీటి అవసరాలు ఏంటీ, వాటి విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలో స్పష్టమైన వైఖరిని బీజేపీ తీసుకోకపోవడం గమనార్హం. గోదావరి, కృష్ణా బేసిన్లల్లో 1500 టీఎంసీల నీటిని ఇచ్చి మీరేమైనా చేసుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. ఇటు తెలంగాణ, అటు ఏపీకి నీటి కేటాయింపులు లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ అవసరాల మేరకు జలాలను పంచుతున్నాయి. ఇందులోనూ బీఆర్‌ఎస్ హయాంలో అన్యాయం జరిగిందనే రాజకీయ విమర్శలు నిత్యం చూస్తూనే ఉన్నాం. చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీ విషయంలో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నది. తమ రాజకీయ అవసరాల కోసం ఒకింత ఏపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ నుంచి కేంద్రంలో బీజేపీ ప్రాతినిథ్యం బాగా ఉన్నా, సమస్యను కేంద్రం దృష్టి తీసుకెళ్లి పరిష్కరింపజేసే దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టడంలో, సాగునీటి ప్రయోజనాలను అర్థంచేసుకుని సహకరించడం లో చొరవ కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంతోపాటు ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఉండటం, తమ పదవులు, ప్రభుత్వాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే తలోమాట అవసరాలను బట్టి మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయించి సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన ఇరువురు కేంద్ర మంత్రులు చడీచప్పుడు చేయడం లేదు. బనకచర్ల విషయంలో ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు చెప్పడం, కాళేశ్వరం విషయంలో కేవలం విమర్శలకే పరిమితం కావడంతో ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. బనకచర్ల అంశంపై ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేస్తున్న విమర్శలు సైతం ఆ పార్టీ విధానానికి భిన్నంగా ఉన్నాయనే విమర్శలు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో సీసీ ఘోష్ కమిషన్ విచారణకు ఈటల హాజరైన సంగతి తెలిసిందే.
ఆ ప్రాజెక్టులపై వివాదాల్లో బీజేపీ వైఖరేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES