మేలో ఐఐపీ 1.2 శాతానికి పరిమితం
తొమ్మిది నెలల కనిష్టానికి పతనం
తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు వెలవెల
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. డిమాండ్ సన్నగిల్లడంతో పారిశ్రామిక ఉత్పత్తుల విక్రయాలు పడిపోతున్నాయి. ప్రజల ఆదాయాలు తగ్గుముఖం పట్టడం, వ్యయాలు పెరగడంతో కొనుగోళ్లు పడిపోతున్న ఫలితంగా మేలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) తొమ్మిది నేలల కనిష్టానికి క్షీణించింది. కేంద్ర గణంకాల శాఖ సోమవారం వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం.. ముఖ్యంగా తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాలు పడకేయడంతో గడిచిన మేలో ఐఐపీ 1.2 శాతానికి పతనమయ్యింది. ఇది తొమ్మిది నెలల కనిష్ట స్థాయి కావడం ఆందోళనకరం. 2024 ఇదే మే నెలలో ఐఐపీ వృద్ధి 6.3 శాతం శాతంగా చోటు చేసుకుంది. దీంతో పోల్చితే అమాంతం పతనమయ్యింది. ఎన్‌ఎస్‌ఓ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన నెలలో తయారీ రంగం వృద్ధి 2.6 శాతానికి పరిమితమయ్యింది. ఈ రంగం 2024 ఇదే నెలలో 5.1 శాతం పెరుగుదలను సాధించింది. ఇదే సమయంలో గనుల రంగం 6.66 శాతం వృద్ధిని సాధించగా..
గడిచిన మే నెలలో 0.1 శాతానికి క్షీణించింది. మరోవైపు విద్యుత్ రంగం ఉత్పత్తి 5.8 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో విద్యుత్ రంగం ఏకంగా 13.7 శాతం వృద్ధిని కనబర్చింది. 2025 ఏప్రిల్‌లో మిషనరీ, వాహనాలు, ఫ్యాక్టరీ, ముడి సరుకులు తదితర మూలధన వస్తువుల విభాగం మాత్రం 14.1 శాతం వృద్ధిని కనబర్చింది. ఇది ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో 2.6 శాతంగా ఉంది. గడిచిన మే నెలలో కాస్మోటిక్స్, ఆహారం, పానియాలు, ఇంధనం, వస్త్రాలు, పాదరక్షలు తదితర కన్స్యూమర్ నాన్ డ్యూరెబుల్ గూడ్స్ ఉత్పత్తి 2.4 శాతానికి పడిపోయింది. 2024 ఇదే నెలలో కన్స్యూమర్ నాన్ డ్యూరెబుల్స్ ఉత్పత్తి వృద్ధి 2.8 శాతంగా ఉంది. ఇదే నెలలో మౌలిక వసతులు, నిర్మాణ రంగం ఉత్పత్తుల వృద్ధి 6.3 శాతంగా చోటు చేసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మే కాలంలో స్థూలంగా పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 1.8 శాతానికి పతనమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఏకంగా 5.6 శాతం వృద్ధి చోటు చేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి గీటురాయిగా భావించే పారిశ్రామికోత్పత్తి సూచీ పడిపోవడం.. మరోవైపు అమెరికా వాణిజ్య టారిఫ్ ప్రతికూల పరిణామాలు ఉపాధి, ఆదాయాలను దెబ్బతీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.