Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తర భారతంలో భారీ వర్షాలు

ఉత్తర భారతంలో భారీ వర్షాలు

- Advertisement -

గుజరాత్‌లో జూన్‌ నెలలో రికార్డు వర్షపాతం ొ హిమాచల్‌లో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ :
దేశరాజధాని ఢిల్లీతో సహా ఉత్తరభారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, గుజరాత్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌కు జూలై 1న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్‌ అలెర్టు జారీ చేసింది. ఈ వారమంతా కూడా రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని తెలిపింది. ఢిల్లీలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకూ విస్తృత వర్షపాతం నమోదయింది. సఫ్దర్‌జంగ్‌లో గత 24 గంటల్లో 14 మీ.మీ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో 2015 తరువాత గుజరాత్‌లో జూన్‌లో అత్యంత వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది జూన్‌లో సోమవారం ఉదయం వరకూ 288 మీమీ వర్షపాతం కురిసింది. ఇది వార్షిక సగటులో సుమారు 33 శాతమని అధికారులు తెలిపారు. జూన్‌ 16న గుజరాత్‌లో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రమంతటా విస్తరించాయి. విస్తృతంగా వర్షాలు కురిసాయి. దీంతో 2023 జూన్‌లో నమోదైన రికార్డు (200.83 మీ.మీ)ను తుడిచిపెట్టాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలతో తీవ్ర నష్టానికి గురయింది. గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. ఉనాలో ఒకరు, బిలాస్‌పూర్‌లో ఒకరు వరద నీటిలో మునిగి చనిపోయారు.


మరొకరు రాజధాని సిమ్లాలో ఎత్తైన ప్రదేశం నుంచి పడి మృతి చెందినట్టు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఈఓసీ) తెలిపింది. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు పడ్డం, నీరు నిలిచిపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. సిర్మౌర్‌లో 57, మండీలో 44 రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా.. 129 రోడ్లును మూసివేయడం జరిగింది. ఆదివారం కురిసిన వర్షానికి సిమ్లాలోని భట్టకుఫర్‌లో ఐదు అంతస్తుల భవనం సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. భవనం కూలిపోతుందనే అనుమానంతోనే ఆ భవనంలో నివశిస్తున్నవారు ముందే ఖాళీ చేసి వెళ్లడంతో.. ప్రాణనష్టం జరగలేదు. ఇక విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. బిలాస్‌పూర్‌, హమీర్‌పూర్‌, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్‌, సిర్మౌర్‌, ఉనా, చంబాతో సహా పది జిల్లాలకు వరద ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. ఒడిశాలో భారీ వర్షాలకు అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. రాజస్థాన్‌లో సోమవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. గత ఆరు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జమ్మూకాశ్మీర్‌లో చీనాబ్‌ నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.


జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
జూలైలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి సోమవారం తెలిపింది. ముఖ్యంగా మధ్య భారతదేశం, ఉత్తరాఖండ్‌, హర్యానాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ‘దేశంలో అనేక ప్రాంతాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం లేదా సాధారణం కంటే తక్కువగా ఉంటాయని భావిస్తున్నాం. అయితే, ఈశాన్య, వాయువ్య, తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది’ అని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజరు మోహపాత్ర సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జులైలో దేశంలో సగటున 28 సెం.మీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. మధ్య భారతదేశం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ద్వీపకల్పంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని మోహపాత్ర అన్నారు. తూర్పు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, విదర్భ, తెలంగాణ ప్రాంతాలు, గుజరాత్‌ , మహారాష్ట్రలోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -