నవతెలంగాణ -హైదరాబాద్ :కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై నిషేధం విధిస్తామని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ దేశంలో విద్వేషాలను ప్రోత్సహిస్తోందని, రాజ్యాంగ పరిధికి లోబడి నడుచుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ “ఒకవేళ మేము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌ను కచ్చితంగా నిషేధిస్తాం. గతంలో ఇందిరా గాంధీ గారు కూడా ఆ పని చేయలేదా? వారు కేవలం చట్టాన్ని అనుసరిస్తున్నట్లు పైకి కనిపిస్తారు. కానీ వారి అసలు ఉద్దేశాలు వేరు” అని అన్నారు. శాసనసభ్యుల పని చట్టాలు చేయడమని, తాము రాజ్యాంగానికి అతీతంగా ఎలాంటి చర్యలు తీసుకోమని ఆయన స్పష్టం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు అందిన రూ. 250 కోట్ల నిధులపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు తప్పనిసరిగా దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.
జూన్ 27న కూడా ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి కీలక ఉద్యమాల్లో ఆ సంస్థ ఏమాత్రం పాల్గొనలేదని ఆయన ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుంచీ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని వ్యతిరేకిస్తోందని, ప్రస్తుతం బీజేపీ ఆ సంస్థకు ఒక కీలుబొమ్మలా మారిపోయిందని ఆయన ఆరోపించారు.