నవతెలంగాణ-హైదరాబాద్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
కాగా, ఇవాళ (జులై 2) హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ముసురుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, నిజామాబాద్, నారాయణపేట్, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు.