నవతెలంగాణ – హైదరాబాద్ : యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేఖలు రాసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రాష్ట్రంలో యూరియా అవసరం అంతకంతకు పెరిగిపోయింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల కోటా నిర్దేశించింది. అందులో ఇప్పటివరకు 3.06 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయింది. అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడింది. తాజాగా జులై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్ ప్రకారం రాష్ట్రానికి 1.60 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. అందులో 60 శాతం ఇంపోర్టెడ్ యూరియాను కేటాయించటం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలో పేర్కొంది. దిగుమతుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే పరిస్థితి లేదని, ఇప్పటి వరకు ఆ యూరియాను రవాణా చేసేందుకు అవసరమైన నౌకల కేటాయింపు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది.దీంతో ఖరీఫ్ పంటలకు అనువైన సమయంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోందని మంత్రి తుమ్మల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరాపై వెంటనే కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలకు కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియాకు నౌకలను కేటాయించాలని కోరారు. RFCL నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుండి 60,000 టన్నులకు పెంచాలని కోరారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తలెత్తిన యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు.
రాష్ట్రానికి సరిపడేంత యూరియాను కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసిన తుమ్మల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES