నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత ఒడిశాలో దారుణం జరిగింది. మేకలు మేపుతున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. జూలై 1న బర్గఢ్ జిల్లా బైరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళ, భలుమారా అడవి ప్రాంతంలో మేకలు మేపుతున్నది. ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులైన భజమాన్ భోయ్, సునంద పిహూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుండగా ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లైంగిక దాడితో పాటు బాధిత మహిళను బలవంతంగా గడ్డి తినిపించి, మురుగు నీరు తాగించారని. బలవంతంగా తలలు గుండు గీయించారని, ఈ ఆరోపణలు నిరూపితమైతే, అవి మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని కమిషన్ పేర్కొంది. ఈమేరకు ఆ రాష్ట్ర సీఎస్‌కు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తమకు అందజేయాలని ఈ నోటీసుల్లో పేర్కొంది.