నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్‌కు పెండింగ్‌లో ఉన్న విపత్తు నిధులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు కుదేలైన ఆ రాష్ట్రానికి రూ.9వేల కోట్లను కేటాయించాలని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఆ రాష్ట్రానికి రూ.4500 కోట్లు కేటాయించామని, కానీ బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.433 కోట్లు ఇచ్చారని విమర్శించారు. విపత్తు ఉపశమనం నిధుల కింద రూ.9000 కోట్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. క్రెడిట్ కోసం పాకులాడకుండా వెంటనే మోడీ ప్రభుత్వం రిలిప్ ఫండ్స్ విడుదల చేయాలన్నారు.
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదల ధాటికి 51 మంది మృతి చెందగా, మరో 22 గల్లంతు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహయక కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉత్తరభారత్‌లోని ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రోజులనుంచి కురుస్తున్న భారీ వానాలు హిమచల్ ప్రదేశ్‌ను నీట ముంచాయి. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి, వరదలకు ధాటికి 51 మంది మృతి చెందగా, మరో 22 గల్లంతు అయ్యారు.