నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరభారత్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కొండ ప్రాంతంలో నిరంతరం కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి.తాజాగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో అలకనంద నది 20 మీటర్లకు పైగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.బెల్ని వంతెన సమీపంలో ఉన్న 15 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం కూడా మునిగిపోయింది. ఈ విగ్రహం కళ్లు నుంచి పై భాగం మాత్రమే కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఆకస్మిక వరదల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. అనేక ప్రాంతాలు ఇప్పటికే భారీ వరదలు, తీవ్ర ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. మరోవైపు.. రాబోయే 24 గంటల్లో మండి, కాంగ్రా, సిర్మౌర్, సోలన్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది. ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, సిమ్లా, కులు, చంబాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.