నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల కమిషన్.. మోడీ, బీజేపీలకు కమిటీగా మారినట్లు కనిపిస్తోందని బీహార్ ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తమ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ప్రతిపక్ష పార్టీలకు అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. కానీ ఈ సందేహాలపై సమావేశం నిర్వహించడానికి ఈసీ జాప్యం చేస్తుందని, కనీసం ప్రతిపక్ష పార్టీలకు కలువడానికి సమయం ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. వారు ఎన్నికల్లో ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు కాబట్టి ఎన్నికల సంఘం వారికి వెనుక నుండి సహాయం చేస్తోందని, వారు ఓడిపోయినప్పుడు మొదట పేదల ఓట్లను, తరువాత పెన్షన్‌ను, ఆ తర్వాత రేషన్‌ను కట్ చేస్తారని విమర్శించారు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఒక హక్కు అని గుర్తు చేశారు.
అదే విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి అన్ని అధికారులను వారి ఆధీనంలో పెట్టుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, బీహార్ ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జమిలి ఎన్నికల పేరుతో మోడీ ప్రభుత్వం ఆర్భాటం చేస్తుందని, ఒక రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ నిర్వహించడానికి అష్టాకష్టాలు పడుతున్నారని తేజీస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు.