Thursday, July 3, 2025
E-PAPER
Homeమానవిజూనియ‌ర్ స్క్వాష్ స్టార్ అనికా

జూనియ‌ర్ స్క్వాష్ స్టార్ అనికా

- Advertisement -

అనికా దూబే… భారత అండర్‌-19 స్క్వాష్‌ జట్టులో మహారాష్ట్ర నుండి అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌ అందుకుంది. త్వరలో కైరోలో జరిగే ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించబోతోంది. పూణె నగరం నుండి ప్రపంచ వేదిక వరకు సాగిన ఆమె ప్రయాణం భారతదేశంలో మహిళా క్రీడాకారిణులకు ఒక మార్గదర్శకత్వం ఇస్తుంది. స్ఫూర్తి నింపుతోంది. కాస్త చేయూత ఇస్తే అట్టడుగు స్థాయి వారిలో దాగి ఉన్న శక్తిని ప్రపంచానికి చాటిచెప్పవచ్చని రుజువు చేస్తుంది. గోల్డెన్‌ గర్ట్‌ ఆఫ్‌ పూణెగా గుర్తింపు పొందిన ఆమె క్రీడా ప్రయాణం నేటి మానవిలో…

అనికా మహారాష్ట్రలోని పూణే నగరంలో ఓ సాధరణ కుటుంబంలో పుట్టింది. 15 ఏండ్లు ఉన్న ఆమె ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. చదువుతో పాటు అథ్లెట్‌గానూ రాణిస్తోంది. ఈ నెలలో ఈజిప్టులోని కైరోలో జరిగే ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశ అండర్‌-19 బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

మొదట్లో కష్టంగా ఉండేది
అనికా చేస్తున్న ఈ ప్రయాణం ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె మహారాష్ట్ర నుండి ఈ స్థాయికి చేరుకున్న అతి పిన్న వయస్కురాలు. వాస్తవానికి అనికా కథ క్రీడా విజయాల కంటే ఎక్కువ. ‘నేను ఆరేండ్ల వయసులో స్క్వాష్‌ ఆడటం ప్రారంభించాను. తొమ్మిదేండ్ల వయసులో పోటీలలో పాల్గొనడం ప్రారంభించాను. మొదట్లో ఇటు ఆటలు అటు చదువు రెండూ నిర్వహించడం కష్టంగా ఉండేది. నెమ్మదిగా, నా తల్లిదండ్రుల సహాయంతో, అలాగే ఒక టైమ్‌టేబుల్‌ తయారు చేసుకొని అలవాటు చేసుకున్నాను’ అంటూ ఇటీవలె ఆమె ఓ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌తో పంచుకుంది.

క్రీడలతో పాటే చదువు
చాన్స్‌2స్పోర్ట్స్‌ అనేది వెనుకబడిన ప్రాంతాల నుండి అథ్లెట్లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక సమగ్ర క్రీడా అభివృద్ధి కార్యక్రమం. ‘అనికా క్రీడలతో పాటు తన చదువులోనూ చాలా బాగా రాణిస్తోంది. తన సమయాన్ని చక్కగా నిర్వహిస్తోంది. ఆమె ఎదుగుదలను నేటి అమ్మాయిలకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆమె ప్రతిభ గురించి మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల నుండి క్రీడా రంగంలోకి వస్తున్న అమ్మాయిలకు సరైన మద్దతు దొరికితే వారు ఎలాంటి విజయాలు సాధిస్తారో చెప్పేందుకు ఒక చక్కని ఉదాహరణ.

రాబోయే రెండేండ్లలో
ప్రపంచ స్థాయి కోచింగ్‌ను పొందేందుకు అనికా నిత్యం పూణే నుండి ముంబైకు ప్రయాణిస్తూ ఉంటుంది. ‘ఒకదాని కోసం మరొకటి విడిచి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చదువుతో పాటు క్రీడలనూ కొనసాగించాలి. ఎందుకంటే క్రీడల నుండి మీరు పొందే జ్ఞానాన్ని ఏ విద్యా సంస్థ అందించగలదని నేను అనుకోను’ అని కోచ్‌ సిన్హా అంటున్నారు. అనికా కూడా దీన్నే కొనసాగిస్తుంది. రెండింటిపైనా తన దృష్టి కేంద్రీకరించింది. ‘రాబోయే రెండేండ్లలో ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌ గెలవాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని ఆమె నమ్మకంగా చెబుతోంది. కోచ్‌ కూడా అనికాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘అనికా పట్టుదల కలిగిన అమ్మాయి. ఆటపట్ల తనకున్న ప్రేమతో వచ్చిన ప్రతి సవాలును ధైర్యంగా స్వీకరిస్తుంది. ఇదే ఆమెలో ఉన్న ప్రత్యేకతే. ఇదే ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళుతుంది. సీనియర్‌ విభాగంలో కామన్వెల్త్‌ గేమ్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను కూడా ఆడుతుందని నేను ఆశిస్తున్నాను’ అని ఆమె అంటున్నారు. ఇలా ప్రపంచ వేదిక వరకు అనికా ప్రయాణం అద్భుతమైన విజయాలతో సాగిపోతుంది.

పట్టుదలతో ప్రయత్నిస్తే…
ప్రస్తుతం అండర్‌-19 బాలికల విభాగంలో భారతదేశంలోనే రెండవ స్థానంలో ఉన్న అనికా ఇప్పటికే మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఆమెను అందరూ ‘పుణే గోల్డెన్‌ గర్ల్‌’ అని ప్రేమగా పిలుస్తారు. అనికా ఇటీవలి ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ క్రీడలలో విజయం సాధించింది. అక్కడ ఆమె అంజలి సెమ్వాల్‌, సునీతా పటేల్‌, ఆకాంక్ష గుప్తాతో కలిసి టీమ్‌ మహారాష్ట్రలో భాగంగా స్వర్ణం సాధించింది. ఈ విజయం కూడా ఆమెలో ఆశను రేకెత్తిస్తుంది. ‘భారత దేశం తరఫున ఆడడం అనేది నా కల. ఇన్నాళ్లకు ఇది నిజం చేసుకోబోతున్నాను. అయితే ఒక్కొక్కసారి మనం అనుకున్నది సాధించలేకపోయినా, మనం దానికే కట్టుబడి ఉండి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు విజయం కచ్చితంగా మనల్ని వరిస్తుంది. ఆ రోజును మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు’ అంటుంది అనికా. ప్రపంచ వేదికపై భారత జెండాను మోసేందుకు అనికా సిద్ధమవుతోంది. ఆమె ఇంకా ఏదో చేయాలతో పట్టుదలతో ఉంది. ఓ చిన్న పట్టణాల నుండి వచ్చిన ఎంతో మంది యువతుల కలలు, వారి ఆశయాలు నిజం చేసుకోవచ్చని రుజువు చేస్తోంది.

గురువు చాలా ముఖ్యం
2020-21లో ఆమె క్రీడా ప్రయాణం ఓ కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. తన 12 ఏండ్ల వయసులో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉండి, వృత్తిపరంగా శిక్షణ పొందిన స్క్వాష్‌ క్రీడాకారిణి అభినవ్‌ సిన్హా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ‘క్రీడల్లో ఎదగాలంటే ఒక గురువు చాలా ముఖ్యం. మార్గదర్శకత్వం, నైపుణ్య అభివృద్ధిలో మీకు సహాయం చేయడానికి ఎవరికైనా సరే గురువు అత్యంత కీలకం’ అంటుంది ఆమె. ప్రస్తుతం సిన్హా చాన్స్‌2స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో అనికాకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -