– తొలి 6 నెలల్లో 60 శాతం మించి నిధులు ఖర్చుచేయొద్దని మెలిక
– రాష్ట్రాలకు సర్క్యూలర్ జారీ చేసిన మోడీ సర్కారు
– తెలంగాణలో ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి
– అదనపు పనుల వేతనాల పెండింగ్‌తో కూలీలకు నష్టం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టం అమలుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో మెలిక పెట్టింది. ఇప్పటికే ఆ చట్టానికిచ్చే నిధులను ఏటేటా తగ్గిస్తున్న కేంద్రం ఈ చట్టం అమలులోనూ రాష్ట్రాల హక్కులను హరించే నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత తొలి ఆరు నెలల్లో 60 శాతానికి మించి నిధులను ఖర్చుపెట్టొద్దని రాష్ట్రాలకు షరతులు విధించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఉపాధి పనులు ఎక్కువ చేసే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మెడమీద ఈ నిబంధన కత్తిలా మారనున్నది. ఇప్పటికే తెలంగాణ ఏర్పడిన నాటినుంచి నేటి వరకు ఒక కొత్త జాబ్ కార్డును కూడా ఇవ్వలేదు. దీంతో వేలాది కుటుంబాలు ఉపాధి పనికి దూరంగా నెట్టివేయబడ్డాయి.
కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ఫలితంగా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో భాగంగా యూపీఏ-1 ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపయోగపడే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ చట్టం రూపుదిద్దుకున్నది. మోడీ సర్కారు మాత్రం దానికి ఏటేటా నిధులను, పనిదినాలను తగ్గిస్తూ పోతున్నది. గతేడాది తెలంగాణకు 12 కోట్ల పనిదినాలు, ఏపీకి 21.5 కోట్ల పనిదినాలు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేవలం 6.5 కోట్ల పనిదినాలు, ఏపీకి 15 కోట్ల పనిదినాలు కేటాయించిన విషయం విదితమే. అంటే పనిదినాల్లో భారీ ఎత్తున కోతపెట్టింది. తాజాగా, ఉపాధి కల్పన విషయంలోనూ కొర్రీలు పెట్టి కూర్చున్నది.
చట్టం అమలుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులలో మొదటి 6 నెలలలో 60 శాతం మించి ఖర్చు చేయకూడదనే నిబంధన తీసుకొచ్చింది. ఇటీవల ఇదే విషయంపై రాష్ట్రాలకు సర్క్యూలర్‌లను జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో డిమాండ్ తగ్గట్టు కూలీలకు పనులు కల్పించాలనే ప్రాథమిక లక్ష్యానికి తూట్లు పొడిచినట్టు అయింది. గతేడాది 12 కోట్ల పనిదినాలు కల్పిస్తేనే ఒక కుటుంబానికి అందిన సగటు పనిదినాల సంఖ్య 46కు మించలేదు. ఇప్పుడు 6.5 కోట్లకు కుదించడం, మరోవైపు ఇచ్చే నిధుల్లో మొదటి ఆరు నెలల్లో 60 శాతం మించి ఖర్చుపెట్టొద్దనడం మెలికలతో పనిదినాల సంఖ్య 30కి పడిపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మూడేండ్ల కాలవ్యవధిలో తెలంగాణలో 6.1 లక్షల కుటుంబాల జాబ్‌కార్డులు తొలగించబడ్డాయి. 21 లక్షల మంది కూలీలను ఉపాధి పనుల నుంచి గెంటేశారు. పనిదినాల కల్పన డిమాండ్‌తో నిమిత్తం లేకుండా కేంద్రం కోరుకున్నంత మేరకు మాత్రమే పని కల్పించాలనే నిర్ణయం సరిగాదనే వాదనలు వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి హామీ చట్టంపై పనిచేస్తున్న లిబ్‌టెక్ లాంటి సంస్థలు వాదిస్తున్నాయి.
60 శాతం మెలికతో ఇబ్బందులే..
తొలి ఆరు నెలల్లో 60 శాతం మించి నిధులు ఖర్చుచేయొద్దనే నిబంధన ప్రభావం ఉపాధి పనులను ఎక్కువగా చేసే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు లేని ఏప్రిల్, మే నెలల్లోనే ఉపాధి పనులు ఎక్కువ జరుగుతాయి. 2024-25లో తెలంగాణలో తొలి ఆరు నెలలకు గానూ 85 శాతం పనులు, ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం పనులు అయిపోయాయి. కేంద్రం విధించిన పరిమితి కంటే ఇది చాలా ఎక్కువ. పనులు చేసినప్పటికీ కేంద్రం 60 శాతం వరకే నిధులిస్తుంది. దీని ద్వారా పనులు చేసిన కార్మికులకు సకాలంలో వేతనాలు అందవు. ఇప్పటికే తెలంగాణలో ఉపాధి కూలీలకు దక్కాల్సిన వేతనాలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌గానీ, ఇటు తెలంగాణ..అటు ఏపీలోని బీజేపీ ఎంపీలు గానీ నోరు ఎత్తకపోవడం దారుణం. ఇప్పటికే ఈ విషయంపై లిబ్‌టెక్ సంస్థ బృందం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు రెండు తెలుగు రాష్ట్రాలకు జరగబోయే నష్టాన్ని వివరించాయి.
ఉపాధిపై కేంద్రం మరో దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES