Thursday, July 3, 2025
E-PAPER
Homeజాతీయంపేద దేశాల ప్రాధాన్యతలపై చర్చ

పేద దేశాల ప్రాధాన్యతలపై చర్చ

- Advertisement -

– ఐదు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ :
పేద దేశాల (గ్లోబల్‌ సౌత్‌) ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్ళేందుకు గల మార్గాలపై రాబోయే రోజుల్లో భారత్‌, బ్రెజిల్‌ చర్చిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చెప్పారు. ఈ నెల 2 నుంచి 9 వరకు ఐదు దేశాల్లో దౌత్యపర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా ప్రధాని ఒక ప్రకటన జారీ చేశారు. రియో డీ జెనీరోలో జరగబోయే బ్రిక్స్‌ సదస్సు ‘సమతుల్యమైన బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందని అన్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని ఘనా, ట్రినిడాడ్‌, టొబాగొ, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు.

గ్లోబల్‌ సౌత్‌ పరిధిలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందన్నారు. వ్యవస్థాపక దేశంగా బ్రిక్స్‌ పట్ల భారత్‌ నిబద్ధతతో వుందన్నారు. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థల మద్య సహకారానికి ఇదొక కీలకమైన వేదిక అని వ్యాఖ్యానించారు. మనందరం కలిసి మరింత శాంతియుతమైన, సమానమైన, న్యాయమైన, ప్రజాస్వామ్యయుతమైన, సంతులన బహుళ ధృవ ప్రపంచవ్యవస్థ కోసం కృషి చేయాలని ప్రధాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రెజిల్‌తో రక్షణ ఉత్పత్తి, సహకారం చేపట్టాలని భావిస్తున్నట్లు న్యూఢిల్లీలో అధికారులు తెలిపారు.

ముందుగా ఆయన ఘనాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్‌ డ్రామాని మహమాతో మోడీ చర్చలు జరుపుతారు. ఘనా పార్లమెంట్‌లో మోడీ ప్రసంగించనున్నారు. ఆఫ్రికన్‌ యూనియన్‌లో కీలక పాత్ర పోషించే ఘనా గ్లోబల్‌సౌత్‌లో చాలా విలువైన భాగస్వామి అని మోడీ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. అక్కడ నుండి ట్రినిడాడ్‌, టొబాగొ వెళతారు. టొబాగొ అధ్యక్షులు క్రిస్టిన్‌ కార్లా కంగ్లూ ఈ ఏడాది ప్రవాసి భారతీయ దివస్‌కు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. మనందరినీ కలిపి వుంచే పూర్వీకులు, బంధుత్వాల ప్రత్యేక బంధాలను పునరుజ్జీవింపచేసేందుకు ఈ పర్యటన ఒక అవకాశం కల్పిస్తుందని మోడీ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బ్యూనస్‌ ఎయిర్స్‌కు వెళతారు. 57ఏళ్ళలో అర్జెంటీనాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీ. లాటిన్‌ అమెరికాలో కీలకమైన ఆర్థిక భాగస్వామి అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలెతో చర్చలకు ఎదురుచూస్తున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చివరగా నమీబియాలో పర్యటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -