Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగాల సాధన కోసం రేపు సచివాలయం ముట్టడి

ఉద్యోగాల సాధన కోసం రేపు సచివాలయం ముట్టడి

- Advertisement -

– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు
నోటిఫికేషన్లను విడుదలచేయాలని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను అమలు చేసి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల విడుదల చేయాలనీ, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమానికి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, యువతీ, యువకులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

కానీ ఇప్పటివరకు కేవలం గత ప్రభుత్వ నోటిఫికేషన్లతో కలిపి 55 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని వివరించారు. ఇంకా 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందన్నారు. అదేవిధంగా జాబ్‌ క్యాలెండర్‌ను నామమాత్రంగా ప్రకటించి అమలు చేయడం లేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నదని అన్నారు. స్పష్టమైన జాబ్‌ క్యాలెండర్‌ని ప్రకటించి అమలు చేయాలనీ, ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేంతవరకు నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి నెలకు రూ.నాలుగు వేలు నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి నేటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని చెప్పారు. నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు.

అనేక ఆశలతో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా కాలం వెళ్లదీస్తున్నదన్నారు. గొప్ప గొప్ప ప్రచార ఆర్భాటాలు నిర్వహిస్తూ ప్రకటనలకే పరిమితమవుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాల కోసం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నామంటూ చెప్పి దరఖాస్తులను స్వీకరించిందని వివరించారు. జూన్‌ రెండో తేదీన లబ్ధిదారులందరికీ నిధులు మంజూరు చేస్తామంటూ ప్రకటించినా, ఇప్పటికీ ఏ ఒక్కరికీ ఆ పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతుల్లేకుండా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా యూత్‌ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావీద్‌, కృష్ణా నాయక్‌, నాయకులు రాజు, భరత్‌, రాజేష్‌, నరేందర్‌, ప్రవీణ్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -