Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలి

మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలి

- Advertisement -

– ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి
– సింగరేణిని బలహీనపరుస్తున్న ప్రభుత్వాలు
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– దేశవ్యాప్త సమ్మె విజయవంతానికి కార్మిక సంఘాల నేతల పిలుపు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీమ్‌ రద్దును చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. బీఈఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు సౌందర్‌ రాజన్‌ అధ్యక్షతన బుధవారం కార్మిక సంఘాల నాయకులు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పదేండ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు రూ.4 లక్షల కోట్ల వాటాలను విక్రయించిందని, 2025-26లో రూ.47 వేల కోట్ల వాటాలు విక్రయించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థలో వాటాలు విక్రయించనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దాన్ని ఆర్థికంగా, భౌతికంగా బలహీనపరుస్తున్నారని విమర్శించారు. 20 ఏండ్లుగా లాభాలు గడిస్తూ, అవార్డులు వస్తున్నప్పటికీ మైన్స్‌, బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కట్టబెడ్తున్నారని తెలిపారు. సింగరేణిలో పదేండ్లుగా రిక్రూట్‌మెంట్‌ చేయకుండా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో సిబ్బందిని నియమిస్తున్నారని, ఈ నిర్ణయాలను ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రతి పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ మాట్లాడుతూ.. ప్రయివేటీకరణ విధానాలు, వ్యూహాత్మక అమ్మకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ వంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు బలహీనపడుతున్నాయన్నారు. హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు మాట్లాడుతూ.. 1957 గనుల చట్టాన్ని కేంద్రం సవరించిందని, ఈ చట్టంలో ఉన్న 12 అణు ఖనిజాల జాబితా నుంచి లిథియం, చెరిబియం, నియోబియం, టైటానియం, జెర్కీనియం వంటి ఖనిజాలను ప్రయివేటు రంగానికి పూర్తిగా కట్టబెట్టాలని నిర్ణయించిందని తెలిపారు. సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. బీడీఎల్‌ ప్రతి ఏడాదీ రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్ల ఉత్పత్తిని సాధిస్తున్నదని, అయితే 2012 నుంచి దాదాపు 700 మంది రిటైర్‌ కాగా.. ఒక్క పర్మినెంట్‌ ఉద్యోగిని కూడా నియమించకపోవడం అన్యాయమన్నారు. ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని

కోరారు.
నారాయణరావు మాట్లాడుతూ.. బీఈఎల్‌లో పదేండ్లలో సుమారు 200 మంది రిటైరయ్యారని, ఇంజినీర్లను 2 నుంచి 5 ఏండ్ల ఫిక్స్‌డ్‌టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌లో నియమిస్తున్నారని తెలిపారు. వివిధ పబ్లిక్‌ సెక్టార్స్‌ నుంచి నాయకులు మాట్లాడుతూ.. సార్వత్రిక సమ్మెను ప్రభుత్వరంగ సంస్థల్లోని పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్‌ యాదవ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ.చంద్రశేఖర్‌, బీఆర్‌టీయూ నాయకులు కాశ్‌రెడ్డి, బీహెచ్‌ఐఎల్‌ నాయకులు రెహమాన్‌, స్వామి, పెంటయ్య, బీడీఎల్‌ నాయకులు మురళి, సత్తయ్య, దాసకర్ణాచారి, బీఈఎల్‌ నాయకులు నిరంజన్‌, హెచ్‌ఎల్‌ నాయకులు వెంకటాద్రి, ఈసీఐఎల్‌ నాయకులు వి.ఎస్‌. బోస్‌, భాస్కర్‌ రెడ్డి, మహిపాల్‌, మిథాని నారాయణరావు, నర్సప్పు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నాయకులు సాంబశివరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -