నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీపై సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినట్లు.. ఈ సారి బీహార్‌లో కూడా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న ఆప్.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి వింత వైఖరిని కనబరుస్తుంది.
కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు రెండు, మూడు దశల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే భారత దేశ చరిత్రలో మొదటి సారి.. ఎన్నికల సంఘం బీహార్‌లో మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ సౌకర్యాన్ని పరీక్షించనుంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గుజరాత్, పంజాబ్ ల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.