నవతెలంగాణ-హైదరాబాద్: అంగన్ వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంగన్ వాడీ టీచర్లుగా పదొన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై గురువారం సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4,322 మంది అంగన్ వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్ళీ అవకాశం లభించనుంది.
గరిష్ట వయోపరిమితిని పెంచాలని అంగన్ వాడీ హెల్పర్ యూనియన్ల నుంచి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధింత అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అయితే అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని సదరు అధికారులు నివేదిక సమర్పించారు.
ఇటీవలే అంగన్ వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 50 ఏళ్ల వయస్సులో టీచర్ గా పదోన్నతి పొందే హెల్పర్లు మరో 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు. 45 సంవత్సరాల వయస్సు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో సంబంధింత ఫైల్ పై మంత్రి సీతక్క సంతకం చేయగా ఇందుకు సంబంధించిన అధాకిరక ఉత్తర్వులు త్వరలోనే వెల్లడి కానున్నాయ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అంగన్ వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.