పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
గురుకుల పాఠశాల సందర్శన
విద్యార్థిని కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ – పరకాల : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని శ్రీవాణి మృతి బాధాకరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మెల్యే మలక్కపేట గురుకుల పాఠశాలను స్థానిక ఆర్డిఓ, డాక్టర్ కే నారాయణ, స్థానిక తహసిల్దార్ తోట విజయలక్ష్మి, ఎసిపి సతీష్ బాంబులతో కలిసిసందర్శించి విద్యార్థిని మృతికి గల కారణాలను ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటనపై చట్ట పరిధిలో సమగ్ర విచారణ జరిపించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థిని మృతి చెందిన నుండి నేటి వరకు ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని కేసు దర్యాప్తు సమగ్రంగా జరిగే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా ఎమ్మెల్యే విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులను కలవలేదని, ఘటన స్థలానికి రాలేదని ఆరోపిస్తున్న దాంట్లో అర్థం లేదన్నారు. రావడం రాకపోవడం సమస్య కాదని మృతికి సంబంధించిన దానిపై సమగ్ర విచారణ జరిపించి కుటుంబానికి న్యాయం చేయించడమే ప్రధానమంటు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తో పాటు, కొన్ని విద్యార్థి సంఘాలను ఉద్దేశించి ఎమ్మెల్యే పరోక్షంగా విమర్శించారు. శ్రీవాణి మృతికి సంబంధించి ప్రభుత్వ ఇప్పటికే శాఖపరమైన నివేదికను కోరడం జరిగిందన్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
కాగా ఎమ్మెల్యే గురుకులాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాను అనుమతించకపోవడం, కానీ ఘటన జరిగిన రోజు విచారణ సందర్భంలో మీడియాను అనుమతించకపోవడం అందుకు సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకోవడానికి గల కారణం ఏమిటి అంటూ నవతెలంగాణ విలేఖరి ప్రశ్నించగా ఎమ్మెల్యే పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామంటూ దాటవేయడం గమనార్హం.
పరామర్శించిన ఎమ్మెల్యే..
గురుకుల పాఠశాల సందర్శనానంతరం ఎమ్మెల్యే విద్యార్థిని శ్రీవాణి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీవాణి కుటుంబాన్నికి తన వంతు సహాయ సహకారాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కడారి సుష్మ, గురుకుల పాఠశాల సూపర్డెంట్ ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లం రఘ నారాయణ, దాసరి బిక్షపతి, గోల్కొండ సదానందం, మాజీ ఎంపీపీ రామ్మూర్తి తదితరులు ఉన్నారు.