మూడు నెలల్లో 767 మంది రైతుల ఆత్మహత్య
పట్టించుకోని డబుల్ ఇంజిన్ సర్కార్
ముంబయి : కేంద్రంలోనూ, రాష్ట్రాల లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. అభివృద్ధి మాట ఏమో కానీ మహారాష్ట్రలో మాత్రం బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ ఏలుబడిలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం తొలి మూడు నెలల వ్యవధిలోనే 767 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు…సాక్షాత్తూ రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి మకరంద్ పాటిల్ శాసనమండలికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు.
‘జనవరి-మార్చి నెలల మధ్య 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 373 రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాం. 200 కుటుంబాలకు అది వర్తించదు. 194 కేసులు పెండింగులో ఉన్నాయి’ అని ఆయన వివరించారు.
ఇప్పటి వరకూ 327 రైతు కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందజేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ ప్రస్తుతం లక్ష రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం 2023లో 2,851 మంది, 2024లో 2,635 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు బుధవారం శాసనమండలి నుండి వాకౌట్ చేశారు. ప్రభుత్వ సంస్థలు సోయాబీన్ రైతుల నుండి పంటను సేకరించినప్పటికీ వారికి చెల్లింపులు జరపడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రతిరోజూ రైతులు బలవన్మరణానికి పాల్పడుతూనే ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మృత్యుఘోషను వినిపించుకోవడం లేదు. 2015-2019 మధ్యకాలంలో రాష్ట్రంలో 12,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
మౌనంగా చూస్తుంటారా? : రాహుల్
సంపన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో గత పది సంవత్సరాలుగా ప్రతి రోజూ సగటున పది మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘ఇవి కేవలం గణాంకాలేనా? కావు…767 కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి చెల్లాచెదురయ్యాయి.
అవి ఎన్నటికీ కోలుకోలేవు’ అని గురువారం ఆయన సామా జిక మాధ్యమం ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రాహుల్ ధ్వజమెత్తుతూ అన్నదాతలు రోజు రోజుకూ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని, అయినా వారి పంట ఉత్పత్తు లకు కనీస మద్దతు ధరలు లభించడం లేదని తెలిపారు. రుణాలు మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ సంక్షోభమే కారణం
మహారాష్ట్రలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభమే రైతు ఆత్మహత్యలకు కారణమని స్పష్టమవుతోంది. జనవరి-మార్చి మధ్యకాలంలో ఒక్క ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్‌లోనే 269 మంది అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారు. గత సంవత్సరం ఈ ప్రాంతంలో జరిగిన ఆత్మహత్యలతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. పరిస్థితి తీవ్రతను ఇది ప్రతిబింబిస్తోంది. పంట ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రభుత్వ విధానాలు ఈ దుస్థితికి కారణమని రైతు హక్కుల నేత జయాజీ సూర్యవంశి విమర్శించారు. సాగునీటి సమస్య, నాణ్యమైన విత్తనాల కొరత, గిడ్డంగి సౌకర్యాలు లేకపోవడం కూడా రైతులను ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. ముఖ్యంగా సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో కేవలం 20 శాతం మందికి మాత్రమే సాగునీటి వసతి ఉంది. మిగిలిన 80 శాతం మంది వర్షాల పైనే ఆధారపడుతున్నారు. పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాలను ఎక్కువగా పండించే విదర్భ, మరట్వాడా ప్రాంతాలలో కేవలం 10-12 శాతం భూములకే నీటి పారుదల సౌకర్యం ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావులు ఎండిపోతున్నాయి. వాన ఎప్పుడు పడుతుందో చెప్పలేని పరిస్థితి. పులి మీద పుట్రలా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ కార్మికుల ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి.