Friday, July 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రాజెక్టులకు పైసల్లేవ్‌

ప్రాజెక్టులకు పైసల్లేవ్‌

- Advertisement -

– తారుమారైన ప్రాధాన్యతలు నత్తనడకన సాగుతున్న పనులు
– బడ్జెట్‌ కేటాయింపులకు…ఖర్చుకు భారీ వ్యత్యాసం
– దెబ్బతింటున్న సర్కారు లక్ష్యం

ఖజానాలో డబ్బుల్లేవంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. బడ్జెట్‌ సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, కేటాయింపులు, ఖర్చులకు మధ్య భారీ అంతరం ఏర్పడుతున్నది. నిధుల లేమితో ఉమ్మడి రాష్ట్రం నుంచి సా….గుతూనే ఉన్న ప్రాజెక్టులకు కూడా ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులన్నింటినీ ఒకేచోట ఖర్చు చేసిన ఫలితం క్షేత్రస్థాయిలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఎక్కువ ఖర్చుతో కూడిన ప్రాజెక్టులు అని రేవంత్‌ సర్కార్‌ ప్రాజెక్టుల్ని ఏ, బీ కేటగిరీలుగా విభజన చేసినా, అమల్లో ఏవీ ముందుకు సాగట్లేదు. సర్కారు ఆదాయం పెరిగితే తప్ప, ప్రాజెక్టులు ముందుకు కదిలే పరిస్థితి లేదు. అయితే ప్రాజెక్టుల కోసం కొత్తగా ఎలాంటి అప్పులు చేయొద్దని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పడంతో, సాగునీటి శాఖలో ఆర్థిక ప్రతిష్టంబన కొనసాగుతోంది. అరకొర నిధులతోనే పనుల్ని నెట్టుకురావాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అదనపు నిధులు ఇవ్వకుండా ఉత్తచేతులు చూపిస్తున్నది.
బి. బసవపున్నయ్య

కాళేశ్వరం నీళ్లు పారకుండానే రాష్ట్రంలో రైతాంగం అద్భుతమైన సాగు చేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పలు వేదికలపై స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ‘కాళేశ్వరం’పై హైప్‌ క్రియేట్‌ చేసుకున్నారే తప్ప, రైతాంగానికి అదనంగా నీరేం ఇవ్వలేదనేది ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన పలు ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. స్వల్ప నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు తొలిప్రాధాన్యత ఇస్తూ, పనుల్ని చేపట్టారు. అయితే ఆశించిన స్థాయిలో ఖజానా గలగలలాడకపోవడం ఇప్పుడు ఆయా ప్రాజెక్టులకు శాపంగా మారింది.


6 లక్షల ఎకరాలు…రూ.7వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం గత జూన్‌ నాటికి ఆరు లక్షల ఎకరాల భూమిని అదనంగా సాగులోకి తేవాలని భావించింది. ఇందుకు సుమారు రూ. 7 వేల కోట్లు అవసరమని సాగునీటి శాఖ అంచనా వేసింది. ప్రాజెక్టుల ప్రాధాన్యత బాగానే ఉన్నా, నిధులు లేక నీరసించింది. 20 ఏండ్ల నాటి ప్రాజెక్టులను ప్రస్తుత వర్షాకాలానికి పూర్తిచేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నా, అది సాధ్యం కాలేదు. ఇక మూడేండ్లల్లో పూర్తిచేయగలిగే ప్రాజెక్టుల గురించి ప్రస్తుతానికి ఆలోచించే పరిస్థితి లేదు. నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం, కాళేశ్వరంలోని కొన్ని ప్యాకేజీలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులకు మాత్రం బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు చేశారు. అయినా ఇవి ఇంకా పూర్తి కాలేదు. గడచిన ఏడాదిలో కాళేశ్వరానికి రూ. 1650 కోట్లు కేటాయించినా, రూ. 611 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.


నాలుగింటికి రూ. 27 వేల కోట్లు
ఇప్పటికే 50 నుంచి 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి. వాటి కోసం రూ.27,546 కోట్లు అవసరం. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.22,856 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.3,638 కోట్లు కావాలి. 50 శాతంలోపు పనులు జరిగిన మూడు ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు అవసరం. ఈ జాబితాలోనే డిండి ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ ఉన్నాయి.


అప్పులతో చేసిన ఖర్చు రూ.98,400 కోట్లు
రాష్ట్రంలో సాగునీటి రంగానికి 2014 వరకు రూ.54,051 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీనిలో బ్యాంకులు, వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణం రూ.98,400 కోట్లు. అత్యధికంగా రూ.71,565 కోట్లు కాళేశ్వరం ఎత్తిపోతలకు ఖర్చు చేశారు. ఇంకొన్ని నిధుల్ని కంతనపల్లి, సీతమ్మసాగర్‌, పాలమూరు-రంగారెడ్డి దేవాదుల, వరద కాలువలకు ఖర్చు చేశారు.


గోదావరితో మూసీ అనుసంధానం
ప్రాజెక్టుల శాస్త్రీయ నిర్మాణం, నిధుల కేటాయింపుల కోసం జిల్లాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో రైతాంగం రోడ్ల మీదకు వచ్చి సాగునీటి కోసం నినదిస్తున్నది. యాదాద్రి జిల్లాలో ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం కోసం పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను మూసీకి అనుసంధానం చేయాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది.


పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి : సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి
రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలి. కోటి 67 లక్షల ఎకరాలకుగాను 73.6 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. అంటే కేవలం 44 శాతమే. ఆ తర్వాత నిర్మాణం చేపట్టిన మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు దశాబ్దాలు గడిచినా పూర్తికావడం లేదు. నిధుల్లేక కాలయాపన మూలంగా నిర్మాణం ఆలస్యమవుతున్నది. దీంతో అంచనా వ్యయం పెరుగుతున్నది. ప్రాధాన్యత క్రమంలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలి.


ప్రాధాన్యతలు ఇలా…
రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ప్రాథాన్యతా క్రమంలో దాదాపు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగానికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులపై తొలి దృష్టి పెట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1.44 లక్షల ఎకరాల భూమిని ఖాస్తులోకి తేవాలని భావించి, బడ్జెట్‌లో రూ.715 కోట్లు కేటాయించారు. కానీ రూ. 200 కోట్లే విడుదల అయ్యాయి. కోయిల్‌సాగర్‌, భీమా, ఎస్సారెస్పీ రెండోదశ, పాలెంవాగు, దేవాదుల తదితర ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇలాగే నిలిచిపోయింది. శ్రీపాద ఎల్లంపల్లి కింద 1.64 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందికి మార్చాలని లక్ష్యంగా పెట్టుకొని, దానిలో తొలి విడతలో 41 వేల ఎకరాలను సాగులోకి తేవాలనే ఉద్దేశ్యంతో 2024-25 బడ్జెట్‌లో రూ.545 కోట్లు కేటాయించారు. కానీ రూ. 172 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -