నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పలు రోజులుగా కురుస్తున్న వానాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగాయి. దీంతో భారీ వరదలకు జనవాసలు, రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా మూతపడిపోయాయి.
ఆ రాష్ట్రంలోని మండి జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్భందమైయ్యాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉదృతికి ఎక్కడికక్కడ రోడ్ల మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. మరికొందరు వరదల్లో గల్లంత అయ్యారు. బాధితులను ఆదుకోవడానికి విపత్తు దళం, ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. తాజాగా వరద నష్టంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రటకన జారీ చేసింది.
ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సానికి వారం రోజుల వ్యవధిలో 37 మంది మృతి చెందగా, 40 మంది గల్లంతయ్యారు. మొత్తం రూ.400 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. ఈ నష్టం మరింత పెరగవచ్చని తెలిపింది. రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నట్లు అక్కడి అధికారులు వివరించారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ మరోసారి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రేపు(శనివారం) సిమ్లా, సోలన్, సిర్మౌర్, 6వ తేదీన ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.