– 9 నుంచి 12 గంటలకు మార్పు
– మహిళలకోసం నైట్‌షిఫ్ట్ ొ ఫ్యాక్టరీ చట్టంలో నిబంధనల సవరణ
– బీజేపీ సర్కార్ ఆర్డినెన్స్ ొ కార్మిక సంఘాల ఆందోళన
గాంధీనగర్ : బీజేపీ పాలనలో పని గంటల విషయంలో కార్మికులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్టరీలలో ఇప్పటికీ కార్మికులు ఎనిమిది గంటలకు మించి మరీ పని చేస్తున్నారు. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఫ్యాక్టరీ కార్మికుల పని గంటలను 9గంటల నుంచి 12 గంటల వరకు పెంచింది. అంతేకాదు, మహిళల కోసం కొత్తగా నైట్ షిఫ్టులను తీసుకొచ్చింది. ఈ మేరకు సంబంధిత చట్టంలో పలు మార్పులను తీసుకొచ్చింది. ఇదంతా కార్మికుల ఇష్టం మీదే ఆధారపడి ఉంటుందనీ, వారి నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతుందని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో వివరించింది. అయితే, ప్రభుత్వ తాజా చర్యపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం పరిశ్రమలకు ప్రయోజనం కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే పని గంటలను పెంచుతూ ప్రభుత్వం ఈ మార్పు తీసుకొచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెట్టింపు చెల్లింపుల పేరుతో కార్మికులను రోబోలుగా, యంత్రాలుగా చూస్తున్నదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలో ఫ్యాక్టరీ కార్మికుల పని గంటలకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫ్యాక్టరీల చట్టం, 1948లోని కీలక నిబంధనలను సవరించింది. ఈ మేరకు కార్మికుల రోజువారీ పని గంటలను 9 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతించే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అదే సమయంలో వారపు పని పరిమితిని 48 గంటలకు పరిమితం చేసింది. కార్మిక, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శాఖ ఈనెల 1న ఫ్యాక్టరీల (గుజరాత్ సవరణ) ఆర్డినెన్స్, 2025ను జారీ చేసింది. అలాగే, ఈ ఆర్డినెన్స్ కొన్ని షరతులకు లోబడి మహిళలను రాత్రి షిఫ్టుల్లో నియమించుకోవటానికి అనుమతించనున్నది.
అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్స్
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరగని సమయం చూసుకొని ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురావటం గమనార్హం. ఆర్థిక కార్యకలాపాలను పెంచటం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన పెట్టుబడులకు కొత్త ప్రాజెక్టులకు ఆకర్షించటం, ఉపాధిని సృష్టించటం కోసం ఫ్యాక్టరీలకు సడలింపు అందించటానికి ఈ ఆర్డినెన్స్ తోడ్పడనున్నది.
పని గంటలు ఈ విధంగా..
ఈ ఆర్డినెన్స్.. ఫ్యాకరీల చట్టంలోని సెక్షన్ 54ను సవరిస్తుంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ ద్వారా రోజువారీ పని గంటలను 12 గంటల వరకు పెంచుకోవచ్చు. విశ్రాంతి, విరామాలతో సహా.. ఏ వారంలోనైనా గరిష్టంగా పనిగంటలు 48 గంటలుగా ఉంటుంది. పెరిగిన గంటలు కార్మికుడి లిఖితపూర్వక అనుమతిపై ఆధారపడి ఉంటాయి. అలాగే, నోటిఫికేషన్ ద్వారా విరామం లేని నిరంతర పని గంటల సంఖ్యను ఐదు నుంచి ఆరు గంటలకు పొడిగించటానికి అనుమతిస్తుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం కార్మికులు సాధారణ రేటు కంటే రెండింతలు ఓవర్ టైం వేతనాలను పొందుతారు.
మహిళలకు నైట్ షిఫ్టులు
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తప్పనిసరి నివారణ చర్యలు, సరైన లైటింగ్, కార్యాలయంలో, చుట్టుపక్కల సీసీటీవీ కవరేజ్, ప్రతి షిఫ్ట్‌కు కనీసం పది మంది మహిళా కార్మికుల బ్యాచ్ పరిమాణం, మహిళా భద్రతా సిబ్బందిని నియమించటం, సురక్షితమైన రవాణా సౌకర్యం వంటి 16 షరతులకు లోబడి రాత్రి 7 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళలను రాత్రి షిఫ్టుల్లో నియమించుకోవటానికి ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. ఏ మహిళా కార్మికురాలిని కూడా రాత్రి షిఫ్టుల్లో పని చేయాలని బలవంతం చేయరాదనీ, రాత్రి షిఫ్టులను ఎంచుకోవటానికి ఇష్టపడేవారి నుంచి లిఖితపూర్వకమైన అనుమతి అవసరమని వివరించింది.
గుజరాత్ లోపని గంటలు పెంపు
- Advertisement -
- Advertisement -