Sunday, July 6, 2025
E-PAPER
Homeకథఆమె లేని జీవితం

ఆమె లేని జీవితం

- Advertisement -

స్వాతి, కిరణ్‌ ఒకే ఆఫీస్‌లో పని చేసేవారు. ప్రతి ఫైలు స్వాతి చూసిన తరువాత కిరణ్‌ దగ్గరకు వెళ్ళేది. ఏదైనా తప్పు ఉంటే స్వాతిని అడిగేవాడు. స్వాతి కూడా వినమ్రంగా సమాధానం ఇచ్చేది. కిరణకు తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. కిరణ్‌కు కలెక్టర్‌ ఆఫీస్‌లో క్లర్క్‌ ఉద్యోగం. ఆ రోజు ఆఫీస్‌కు వెళ్తుంటే ”ఈ రోజు నీకు పెళ్ళి చూపులు త్వరగా రా” అంది తల్లి.
”మనం అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి కాని వాళ్ళు రావడం ఏమిటి” అన్నాడు.
”వాళ్ళు ఏదో పని మీద వచ్చారట, అమ్మాయికి తల్లి లేదు. తండ్రి చాటు బిడ్డ. అందుకు పంతులుకు చెప్పి వస్తున్నారు నువ్వు ఏమంటావ్‌” అంది తల్లి.
”సరేలేమ్మా చూద్దాం, త్వరగా వస్తానులే” అని స్కూటర్‌ స్టార్ట్‌ చేసి వెళ్ళాడు.
అప్పటికి ఇంకా స్వాతి రాలేదు. స్వాతికి ఎవరూ లేకపోతే వర్కింగ్‌ హాస్టల్‌లో ఉంటోంది. తల్లి చిన్నప్పుడే పోవడం, ఆ బాధతో నాన్న కూడా పోవడంతో ఒంటరి అయింది. నాన్న సర్వీస్‌లో ఉన్నప్పుడే అనారోగ్యంతో బాధ పడుతుంటే వాలంటరీ రిటైర్‌ తీసుకుని తన ఉద్యోగం స్వాతికి ఇప్పించాడు. ఆ ఉద్యోగంతోనే కాలం నెట్టుకొస్తోంది.
ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు ఏమీలేవు. చాలా హడావుడిగా వచ్చింది స్వాతి. ఆమె రాకను ఓరకంటితో చూసి తన పనిలో నిమగమైనాడు.
స్వాతి ఏదో టైపు చేసి ”ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి కిరణ్‌ గారు. మీరు సాయంత్రం వరకు మేనేజ్‌ చేయండి” అంది.
గతుక్కుమన్నాడు కిరణ్‌. ”నేను కూడా సాయంత్రం త్వరగా వెళ్ళాలి” అన్నాడు.
క్రీగంటగా చూసింది కిరణ్‌ వైపు. ”కిరణ్‌ నవ్వుతూ ఈ రోజు నాకు పెళ్ళి చూపులు ఉన్నాయి అందుకు” అన్నాడు.
”అయితే నేను వెళ్ళనులెండి” అంది తన సీట్‌లో కూర్చుంటు.
అనుకున్న సమయానికి వెళ్ళాడు కిరణ్‌. అతని కోసమే ఎదురు చూస్తున్నారు పెళ్ళి కూతురు తండ్రి, పంతులు. కిరణ్‌ స్కూటర్‌ పార్క్‌ చేసి, వాళ్లకు నమస్కరించి లోపలకు వెళ్ళాడు.
పంతులు కల్పించుకుని ”ఒక్కడే కొడుకు, ఈ ఇల్లు ఉంది, కొద్దిగా డబ్బు ఉంది” అన్నాడు.
”ఆది సరే ముందు అబ్బాయి ఇల్లరికం ఉంటాడేమో అడగాలి కదా” అన్నాడు అమ్మాయి తండ్రి.
ఇల్లరికం అనే మాట కిరణ్‌కు వినపడటంతో హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.
”నాకు నచ్చితే అమ్మాయి ఓకే అంటుంది, అందుకే తీసుకు రాలేదు. తన స్నేహితురాలు ఇంట్లో ఉంది” అన్నాడు అమ్మాయి తండ్రి.
ఇంతలో ఫలహారాలు తీసుకు వచ్చింది కిరణ్‌ తల్లి.
”ఇల్లరికం అంటున్నారు మీకు ఇష్టమేనా!” అబ్బాయిని అడిగాడు పంతులు.
”వద్దు. నాకు ఇల్లరికం ఇష్టం లేదు. అమ్మను వదులుకుని రాలేను” అన్నాడు.
తర్జన బర్జన తరువాత వచ్చిన వాళ్ళు విసురుగా వెళ్ళారు.
మరుసటి రోజు ఆఫీస్‌లో స్వాతి అడిగింది ”ఎంత కట్నం అడిగారు?”.
ఊహించని ప్రశ్నకు నిర్వేదంగా చూస్తూ ”కట్నమే నాకు అక్కర లేదు. వచ్చే ఆమె మా అమ్మను బాగా చూసుకుంటే చాలు” అన్నాడు.
”ఇంతకు ఏమైంది?” అంది స్వాతి.
”వాళ్ళకు ఇల్లరికం కావాలన్నారు”అన్నాడు
”అది సరే.. మీరు ఎంత ఇచ్చారు” అన్నాడు.
”ఏమిటి?” సందేహంగా అడిగింది స్వాతి.
”కట్నమండి, అదే డబ్బు. మనిషిని నడిపించే ఇంధనం” అన్నాడు.
స్వాతి నవ్వి ”అంత డబ్బే ఉంటే మీకే ఇద్దును” అంది.
”అంటే” అన్నాడు కిరణ్‌.
తనకు తండ్రి ఉద్యోగం తనకు వచ్చిందని, తల్లీ, తండ్రీ లేరు అని చెప్పింది.
కిరణ్‌ మదిలో స్వాతి తొణికిసలాడింది. స్వాతిపై మనసు కలగడం, మనువు చేసుకోవటం, ఇద్దరూ అన్యోన్యంగా ఉంటే మన బంధం బాగుంటుంది అనే ఆలోచన కలిగింది. వెంటనే ”మీకు అభ్యంతరం లేకుంటే…” అని ఆగాడు.
”స్వాతి మీ ఇష్టమే నా ఇష్టం” అంది. ఒక శుభముహూర్తాన ఇద్దరికీ మనువు అయింది. కాలం గిర్రున తిరుగుతోంది. కిరణ్‌ తల్లి కాలం చేసింది. ఒక రోజు ఆఫీసుకు ఇద్దరూ స్కూ టర్‌లో వెళ్ళుతుందగా నోట్లోనుంచి రక్తం పడింది స్వాతికి.
కిరణ్‌ కంగారుగా ”ఏమైంది స్వాతి” అంటూ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. డాక్టర్‌ పరీక్షలు అన్నీ చేసి, కిరణ్‌ ప్రక్కకు పిలిచి ”మీ ఆవిడకు కాన్సర్‌” అంది. ఆ మాటకు కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది.
”డాక్టర్‌” అన్నాడు మెల్లగా.
”ఏ రోజైనా ఆమె….” అంటుండగా
”వద్దు డాక్టర్‌. ఆమాట నేను వినలేను” అని కళ్ళు మూసుకున్నాడు.
”మీరు ఆమెను తీసుకుపోవచ్చు” అనగానే కిరణ్‌ ఆమె వైపు నడిచాడు. స్వాతి భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ ఆటోలో కూర్చున్నాడు.
”ఏమైంది డాక్టర్‌ ఏం చెప్పారు” అంది స్వాతి.
”ఏమీ లేదు కొంత కాలం విశ్రాంతి కావాలి అన్నారు”.
”ఇక ఎప్పుడూ విశ్రాంతే కదండీ” అంది స్వాతి.
”ఛా… అవేం మాటలు స్వాతి” అన్నాడు కిరణ్‌.
”నాకు అంతా తెలుసండి. ఈ ఊపిరి ఎప్పుడైనా ఆగి పోవచ్చు. మీరు జాగ్రత్త. ఇక నాకు విశ్రాంతి” అని భుజంపై వాలిపోయింది.
ఆఫీసులో తన పని చూసుకుంటూ స్వాతి సీట్‌ వంక చూశాడు. ఏదో ఫైలు తెమ్మన్నట్లుగా పలకరించింది. ఫైలు తీసుకుని నిర్వేదంగా అటు నడిచాడు.
– కనుమ ఎల్లారెడ్డి, 93915 23027

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -