సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం 2025 రోస్టర్ విధానం వల్ల
మాలలకు జరుగుతున్న అన్యాయం- భవిష్యత్తు కార్యాచరణ పై చర్చ
నవతెలంగాణ – హైదరాబాద్:
బత్తుల రాంప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ సదస్సుకు డాక్టర్ మంచాల లింగస్వామి సభాద్యక్షత వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మాల సంఘాలు, మాల విద్యార్థి సంఘాలు, మాల నిరుద్యోగ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. మాలలను గ్రూపు-III లో చేర్చి రోస్టర్ పాయింటు 22 కేటాయించడం ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ లో జరుగబోయే 35 పార్ట్ టైం లెక్చరర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఎస్సీలకు వచ్చే 6 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా మాల కులానికి రాలేదు. మెడికల్ , హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ద్వారా సాధారణ నియామకాల లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎస్సీలకు వచ్చే 126 ఉద్యోగాలలో గ్రూపు-2 లోని మాదిగలకు అత్యధికంగా 73 వస్తే గ్రూపు-3 ఉన్న 25 మాల, మాల అనుబంధ కులాలకు కేవలం 26 ఉద్యోగాలు వస్తే, గ్రూప్-1 లోని కులాలకు 24 రావడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో 5386 సబ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ లైన్మెన్ , ప్లాంట్ అటెంటెంట్ ఉద్యోగ నియామకాలలో మాల, మాల అనుబంధ కులాలకు భవిష్యత్తులో తీవ్రమైన నష్టం జరుగబోతోంది. నాడు జనాభా లెక్కలు చేసిన కేంద్ర ప్రభుత్వమే తిరస్కరించిన 2011 జనాభా గణనను ఆధారంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉప వర్గీకరణ చేస్తూ అందులో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, రోస్టర్ పాయింట్లలో తొండి చేసింది. గతంలో 1997లో జస్టిస్ రామచంద్ర రాజు ఇచ్చిన సిఫారసులలో, ఆంధ్రప్రదేశ్ ఉప వర్గీకరణ చట్టం-2000 లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్ విధానం కాకుండా కేవలం మాదిగలకే విద్య, ఉద్యోగాలలో అత్యధిక ప్రయోజనం కలిగే విధంగా సీరియల్‌గా రావాల్సిన పాయింట్లను ముందు, వెనుకకు చేస్తూ ప్రభుత్వం అతిపెద్ద కుట్రకు తెరలేపింది. ఇంకా రిజర్వేషన్ల లబ్ధి పొందడంలో చివరగా ఉండి గ్రూపు-1 లోని కులాలకు కేవలం 1% రిజర్వేన్లు కల్పించి రోస్టర్ పాయింట్ ఏడును కేటాయించి, మధ్యమంగా రిజర్వేషన్లు లబ్ధి పొందిన గ్రూప్-2 లోని మాదిగలకు 9% రిజర్వేషన్లు ఇస్తూ రోస్టర్ పాయింట్ రెండుతో ప్రారంభించారు, ఇక గ్రూప్-3లో ఉన్న 25 మాల, మాల అనుబంధ కులాలకు రోస్టర్ 22 తో మొదలు చేసి రిజర్వేషన్లు అందిస్తున్నారు. సాధారణంగా అనేక యూనివర్సిటీలు, శాఖలలో 15 నుండి 20 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేస్తే మాలలకు అసలు దరఖాస్తు చేసుకునే హక్కు కూడా లేకుండా పోతుంది. గ్రూప్-III రోస్టర్ పాయింటును
22 ను 16 కు మార్చేంత వరకు పోరాటం చేస్తాం. ఆగస్టు 1 వ తేదీని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల బ్లాక్ డే గా ప్రకటిస్తున్నాం. ఆరోజు హైదరాబాదును అష్ట దిగ్బంధనం చేసి రేవంత్ రెడ్డి సర్కారుకు మాలల సత్తా చూపిస్తాం. మాలల మహా ధర్నా నిర్వహిస్తామని, సర్కారు మాలలను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కో- ఆర్డినేటర్ ఆవుల సుధీర్, సీనియర్ జర్నలిస్టు ఆస శ్రీరాములు, కరణం కిషన్, గోపోజు రమేష్, పసుల రామ్మూర్తి, సుదమల్ల అంజలీ, ఇందిరా, మైస నాందేవ్, రాహుల్ మధునూరి, మణిదీప్, ఆదర్శ్ మౌర్య, విశాల్, నామ సైదులు, సళ్లా పవన్, సామ శ్రీనివాస్, అరుణ్ నంద, రేణు తదితరులు పాల్గొన్నారు
వర్గీకరణ రోస్టర్ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES