Monday, July 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకోరుకొండలో చదవడమే శాపమా?

కోరుకొండలో చదవడమే శాపమా?

- Advertisement -

– స్థానికేతరులుగా తెలంగాణ విద్యార్థులు సైనిక పాఠశాలకు ప్రభుత్వ అనుమతి..ఫీజులూ చెల్లింపు
– గతేడాది వరకు స్థానికులే.. తాజాగా నిబంధనలు మార్పు
– తెలంగాణలో చదివితేనే స్థానికులుగా గుర్తింపు
– ఆందోళనలో విద్యార్థులు
– ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లు కోల్పోయే ప్రమాదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సైనిక పాఠశాల ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా కోరుకొండలో ఉన్నది. చిత్తూరు జిల్లా కలికిరిలో మరో సైనిక పాఠశాల 2014లో ప్రారంభమైంది. వాటిలో ఎంతో ఇష్టపడి, కష్టపడి తెలంగాణ విద్యార్థులు సీట్లు సంపాదించారు. వారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానికేతరులుగా మారిపోయారు. కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో వారు చదవడమే శాపంగా మారింది. అయితే తెలంగాణలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక పాఠశాలను నెలకొల్పలేదు. ఏపీలో మాత్రం రెండు పాఠశాలలను మంజూరు చేసింది. తెలంగాణలో సైనిక పాఠశాల లేకపోవడంతో ఈ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఏపీలో చదివేందుకు ఆసక్తి చూపారు. అది వారి పాలిట శాపంగా మారింది. ఇంకోవైపు కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం వరకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యార్థులకు ఏపీతో కలిపి 67 శాతం సీట్లు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. వారి ఫీజులను కూడా చెల్లించింది. కానీ ఆ విద్యార్థులను మాత్రం స్థానికులుగా గుర్తించడం లేదు. 2024-25 విద్యాసంవత్సరం వరకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో చదివిన విద్యార్థులను కూడా తెలంగాణ ప్రభుత్వం స్థానికులుగానే పరిగణించింది. ఏపీ పునర్విభజన చట్టం కాలపరిమితి పదేండ్లు ముగియడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26) నుంచి నిబంధనలను మార్చింది. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణిస్తున్నది. వారికే రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో స్థానికుల కోటా కింద సీట్లు కేటాయిస్తున్నది. దీంతో ఏపీలోని కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారడంతో సీట్లు కోల్పోయే ప్రమాదమున్నది.


శ్రేష్ట పథకం ద్వారా ఏ రాష్ట్రంలో చదివినా స్థానికులే…
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ శ్రేష్ట పథకం ద్వారా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు వివిధ రాష్ట్రాల్లో ప్రయివేటు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలను కల్పిస్తున్నది. తెలంగాణ విద్యార్థులు కూడా ఆ పథకం కింద సీట్లు పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో విద్యనభ్యసిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రేష్ట పథకం ద్వారా ఈ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో చదివినా తెలంగాణ స్థానికులుగానే పరిగణించాలని నిర్ణయించింది. దానివల్ల ఎస్సీ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివినా తెలంగాణలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లను స్థానికుల కోటా కింద పొందుతున్నారు. కానీ ఏపీలోని కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో చదివిన తెలంగాణ విద్యార్థులను మాత్రం స్థానికేతరులుగా పరిగణిస్తున్నది. దీంతో వాటిలో చదివిన వందలాది మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో సైనిక పాఠశాల అందుబాటులో లేదనీ, అందుకే కోరుకొండ, కలికిరిలో అందుబాటులో ఉండడంతో చేరినట్టు చెప్తున్నారు. అక్కడ చదవడమే తాము చేసిన తప్పా?అని ప్రశ్నిస్తున్నారు.


స్థానికేతర కోటా కింద సీటు కేటాయిస్తే నష్టపోతాం : విద్యార్థులు
‘తెలంగాణలో పుట్టి ఐదో తరగతి వరకు ఇక్కడే చదివాం. ఉన్నత విద్య కోసం జాతీయస్థాయిలో పోటీపడి కోరుకొండ సైనిక పాఠశాలలో సీట్లు సంపాదించాం. 2017లో ఆరో తరగతిలో ప్రవేశం పొంది 12వ తరగతి వరకు చదివాం. 2024లో ఉత్తీర్ణత పొందాం. టీజీఎప్‌సెట్‌ రాసి మంచి ర్యాంకు పొందాం. ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్తే అధికారులు మీరు తెలంగాణ కాదు ఆంధ్రకు స్థానికులు అని స్థానికేతర కోటా కింద సీట్లు కేటాయిస్తామంటున్నారు. మేం ఆశ్చర్యానికి గురయ్యాం. కోరుకొండ సైనిక పాఠశాలలో చదివినంత మాత్రాన మేము ఆంధ్రప్రదేశ్‌కు ఎలా చెందినవాళ్లం అవుతాం. మాకు ప్రవేశం కల్పించినపుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రెండు రాష్ట్రాల విద్యార్థులు కూడా స్థానికులే. అందుకని ఆ పాఠశాలలో 12వ తరగతి వరకు చదివాం. అక్కడ చదివితే తెలంగాణకు స్థానికేతరులుగా అవుతారని మాకు చెప్తే అక్కడ చదివే వాళ్లమే కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాల ఉంటే మేము మా రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లేవాళ్ళమే కాదు. మేము తెలంగాణ స్థానికులం కానందున రిజర్వేషన్‌ కూడా వర్తించడం లేదు. ఎన్‌సీసీ బీ సర్టిఫికెట్‌ వర్తించడం లేదు. దీంతో టాప్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్లు కోల్పోతాం. మా భవిష్యత్తు ఏంటీ?. పరీక్ష రాయించిన మా తల్లిదండ్రులది తప్పా! అక్కడ చదువుకున్న మాది తప్పా. లేదంటే తెలంగాణలో సైనిక స్కూలు నిర్వహించలేని పాలకులది తప్పా!? తెలంగాణకు చెందిన మమ్మల్ని అసంబద్ధ నిర్ణయాలతో జీవోలు ఇచ్చిన అధికారులది తప్పా?. మాకు న్యాయం చేయాలి. స్థానికులుగా గుర్తించి సీట్లు కేటాయించాలి.’అని కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థులు ఎం నిశాంత్‌ కిరణ్‌, పిఅభిషేక్‌, ఎ వర్షిత్‌ నవతెలంగాణతో చెప్పారు.


విద్యార్థులకు న్యాయం చేయాలి : టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో చదివిన తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. శ్రేష్ట పథకం కింద వివిధ రాష్ట్రాల్లో చదివిన ఎస్సీ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తున్నట్టుగానే సైనిక పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా మినహాయింపునివ్వాలి. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -