Sunday, July 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురైతులకు ఎవరేం చేశారో చర్చిద్దాం

రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దాం

- Advertisement -

ప్లేస్‌, డేట్‌, టైం నిర్ణయించి చెప్పండి
ప్రిపరేషన్‌కు 72 గంటల టైం ఇస్తున్నాం
సీఎం రేవంత్‌ రెడ్డి ఛాలెంజ్‌కు కేటీఆర్‌ సవాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు సిద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధపడేందుకు 72 గంటల టైం ఇస్తున్నట్టు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్‌ అని రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెబుతారని తెలిపారు. గురువు చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు పారిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ముమ్మాటికీ కోవర్టేనని విమర్శించారు. రేవంత్‌రెడ్డితో చర్చించేందుకు కేసీఆర్‌ అవసరం లేదనీ, తాను సరిపోతానని చెప్పారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి లేదా ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ లేదా కేసీఆర్‌ సొంతూరు చింతమడక, ఆయన ప్రాతినిథ్యం వహించే గజ్వేల్‌లో ఎక్కడికైనా వచ్చేందుకు రెడీ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చినా సరే 8న ఉదయం 11 గంటలకు చర్చిద్దామన్నారు. స్థలం, సమయం, తేదీ రేవంత్‌ రెడ్డి ఇష్టమనీ, తమ పార్టీ తరపున సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను భారతదేశంలో నెంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. 9 ఏండ్ల కాలంలో సుమారు 9 బిలియన్‌ డాలర్ల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన కేసీఆరే రైతు రాజ్యం తెచ్చారని తెలిపారు. రైతులకు పెట్టుబడి, ఉచితంగా 24 గంటల కరెంట్‌ ఇచ్చారని చెప్పారు. మిషన్‌ కాకతీయతో చెరువులను నింపారని, చెక్‌డ్యామ్‌లు నిర్మించారని, గోదావరి నీళ్లతో కూడెల్లి, హల్దీ, మంజీరా వాగులను నింపారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యమంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడడమే అనే పాత రోజులను మళ్లీ రేవంత్‌ రెడ్డి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల కోసం రైతులు యుద్ధం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలమవుతుంటే రూ.7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి చివరి గింజ వరకు కొని రైతుల కడుపు నింపింది కేసీఆర్‌ కాదా? రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇచ్చింది కేసీఆర్‌ కాదా? రైతు బీమా ప్రీమియం చెల్లించకుండా మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా? అంటూ కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా కేసీఆర్‌ మార్చారనీ, రూ.30 వేల కోట్ల మత్య్స సంపద సృష్టించారని తెలిపారు. ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమికొట్టారన్నారు. రైతు డిక్లరేషన్‌లో ఒక్క హామీని రేవంత్‌ రెడ్డి నెరవేర్చలేదని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది రేవంత్‌ సర్కార్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -