Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమిషన్‌ భగీరథ నీరు కలుషితం

మిషన్‌ భగీరథ నీరు కలుషితం

- Advertisement -

– ఐదు రోజులుగా నల్లాల్లో ఎర్రటి రంగులో సరఫరా
– బిందెల్లో పేరుకుంటున్న బురద
– ఎలా తాగాలని ప్రశ్నిస్తున్న జనాలు
నవతెలంగాణ-పెద్దవూర

మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు పూర్తిగా కలుషితమైంది. నల్లాల్లో నుంచి ఎర్రటి రంగులో నీరు వస్తోంది. బిందెల్లో పట్టాక అడుగున బురద పేరుకుపోతోంది… దాంతో ఈ నీటిని ఎలా తాగాలంటూ జనం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామంలో పూర్తిగా కలుషితంగా మారింది. ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీటిని అందిస్తోంది. వర్షాకాలం ట్యాంకులు శుభ్రంగా ఉంచాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పైపులు పగిలిన చోట సరైన మరమ్మతులు చేయకపోవడంతో మొత్తం మురికి నీళ్లు ట్యాంక్‌ లోకి వెళ్తున్నాయి. అదే నీటిని సరఫరా చేయడంతో తాగడానికి వీలులేకుండా బిందెలు, సంపుల్లోని అడుగుభాగంలో మొత్తం బురద పేరుకుపోతున్నది. పోతునూరు గ్రామంలో ప్రయివేట్‌ ప్లాంట్ల ఫిల్టర్‌ వాటర్‌ తాగడంతో పలురకాల వ్యాధులు వస్తున్నాయని చాలామంది మిషన్‌ భగీరథ నీటినే తాగుతున్నారు. అయితే, ఆ నీరు ఐదు రోజులుగా వాడుకోవడానికి కూడా వీలు లేనంత మురికిగా వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. వాటర్‌మెన్‌లను అడిగితే పైనుండే అలా వస్తున్నాయని చెబుతున్నారని స్థానిక మహిళలు వివరించారు. అసలే వర్షాకాలం కావడంతో మురికినీరు తాగితే ఎలాంటి వ్యాధులు వస్తాయోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్‌ లోకి నీళ్లు వచ్చే ఇనుప పైపు మొత్తం తుప్పు పట్టిపోయింది. ఇంచు మందం సిలుము పట్టింది. అధికారులు స్పందించి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని, కొత్త పైపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బురద నీరు వస్తోంది
ఐదు రోజులుగా నల్లాల్లో మొత్తం బురద నీరువస్తోంది. బిందెల్లో అడుగు భాగంలో బురద పేరుకుంటున్నది. గతంలో ఎప్పుడూ తాగునీటిలో ఇంత మురికి చూడలేదు. నల్లాల్లో తాగునీరు ఎర్రటి రంగులో వస్తోంది. వేడి చేసి వడపోసినా నీరు రంగు మారడం లేదు. ఇలాంటి మురికి నీటిని తాగితే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అధికారులు చర్యలు తీసుకుని కలుషిత నీటి సరఫరాను అరికట్టాలి.
– మేడారం సైదమ్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -