Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపంచాయతీరాజ్‌పై సర్కారు దృష్టి

పంచాయతీరాజ్‌పై సర్కారు దృష్టి

- Advertisement -

– ప్రక్షాళన కోసం ప్రయత్నాలు
– మిషన్‌ భగీరథలో సీఈలకు పనివిభజన
– మరింత సమర్థవంతంగా పింఛన్ల పంపిణీ
– ‘స్థానిక’ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ శాఖ పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్న ప్రభుత్వం, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పింఛన్లు, ఇతర పథకాలను అమలు చేస్తున్నది. ఈ శాఖతో ప్రజలకు నేరుగా లింక్‌ ఉన్న నేపథ్యంలో సేవలను మరింత పకడ్బందీగా అందించేందుకు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. ఈ తరుణంలో ఇటీవల బదిలీల్లో భాగంగా ఈ శాఖకు ముఖ్యకార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ను సర్కారు నియమించింది. ఆయన శాఖా కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఇందులోభాగంగా మిషన్‌ భగీరథ విభాగం కార్యకలాపాలపై వచ్చే మంగళవారం సమీక్ష చేయనున్నారు. అలాగే ఈ శాఖ పరిధిలోని ఇతర విభాగాలనూ సమీక్ష చేసేందుకు కార్యాచరణకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 సెగ్మెంట్లగాపే 22 వేల హ్యాబిటేషన్లకు భగీరథ తాగునీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిర్వహణ సమస్యలు అధికంగా ముందుకొస్తున్నాయి.
భగీరథలో నిర్వహణా సమస్యలు
2017లో భగీరథ ప్రాజెక్టును చేపట్టి 2019 చివరలో పూర్తి చేశారు. దీనికి రూ. 38 వేల కోట్లు ఖర్చు చేశారు. అయినా అక్కడక్కడా సమస్యలు తప్పడం లేదు. ప్రధానంగా నిర్వహణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పైపులైన్ల లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మొత్తం పైపులే పగిలిపోతున్నాయి. నాణ్యతా లోపాలతో నల్లాలు సరిగ్గా లేవు. వాటర్‌ ట్రిట్‌మెంట్‌ ప్లాంట్లు సైతం మొరాయి స్తున్నాయి. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్వహణ సైతం అస్త వ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం తొమ్మిది మంది సీఈలకు పనివిభజన చేశారు. ఇంతకు ముందే ఈతరహా విధానం ఉన్నప్పటికీ, ఇటీవల ఇద్దరు, ముగ్గురు సీఈలు ఉద్యోగ విరమణ చేయడంతో జిల్లాలను సర్దుబాటు చేసి పనిలో లోపాలను సరిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సీఈలకు పని విభజన
చీఫ్‌ ఇంజినీర్‌ కె.సురేష్‌కు వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ను కేటాయించారు. సీఈ పి శ్రీనివాసరెడ్డికి నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలు, సీఈ కె శ్రీనివాస్‌కు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు, సీఈ బీసీ జ్ఞాన్‌కుమార్‌కు ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలు ఇచ్చారు. అలాగే సీఈ జి లలితకు మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు, సీఈ రామ్‌చంద్‌కు యాదాద్రి-భువనగిరి, జనగామ, సిద్దిపేట, మేడ్చల్‌ జిల్లాలు కేటాయించారు. సీఈ సీహెచ్‌ అమరేంద్రకు కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఇవ్వగా, సీఈ జె మధుబాబుతో పాటు మరో సీఈ ఏ విజరుకుమార్‌కు మిషన్‌ భగీరధ కేంద్ర కార్యాలయ బాధ్యతలను అప్పగించారు.
పీఆర్‌లో ప్రాజెక్టులు
పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖలో పలు రోడ్డు ప్రాజెక్టులు రానున్నాయి. భారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. ఇటీవల సమీక్షల్లో మంత్రి సీతక్కతోపాటు వెంకటరెడ్డి సైతం రూ.6500 కోట్ల మేర రోడ్ల కోసం టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. ఇందుకు ప్రత్యేక విధానాన్ని అవలంభించనున్నట్టు ప్రకటించారు ‘హ్యామ్‌’ పేరుతో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర్ర రాజధాని హైదరాబాద్‌కు హ్యామ్‌ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రోడ్లు, భవనాల శాఖ సహకారం సైతం తీసుకోనున్నారు.
గ్రామీణాభివృద్ధిలో పింఛన్లు
గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో కీలకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతోపాటు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. సెర్ప్‌ పర్యవేక్షణలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలవుతాయి. అన్ని రకాల ఆసరా పింఛన్లు కలిపి దాదాపు 44 లక్షల వరకు ఉంటాయి. వీటితోపాటు ఇతర అభివృద్ధి పథకాలకు రూ. 12 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయిస్తారు.
ఇది చాలా ప్రాధాన్యతల గల శాఖ. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయడం, పథకాలను క్షేతస్థ్రాయికి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంపై దృష్టిపెట్టనున్నారు. అసలే సర్కారుకు ఆర్థిక ఇబ్బందులు నెలకొన్న సమయంలో ఈ తరహా చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు, నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. ఉపాధి హామీ కోసం ప్రతియేటా రాష్ట్రానికి దాదాపు రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. ఈనేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాడిన పడేయాలని భావిస్తున్నది.
‘స్థానికం’పైనా సమాలోచనలు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. దాదాపు 18 నెలలుగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తొలుత కేవలం మూడు నెలల అనుమతి తీసుకున్న ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లు, ఇతర అంశాల నేపథ్యంలో ఏడాదిన్నరకుపైగా సమయం తీసుకుంది. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేస్తేనే స్థానిక సంస్థలపై అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల్లో గట్టెక్కేందుకు పల్లెల్లోని పరిపాలన వ్యవస్థను మెరుగు పరచాలనేది సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -