రైతులు, డీలర్లను టార్గెట్ చేస్తున్న మోడీ సర్కార్
రవాణాచార్జీల పేరుతో అదనపు బాదుడు
కాంప్లెక్స్ ఎరువులతో యూరియా, డీఏపీలకు లింకు
నానో యూరియా, డీఏపీల వాడకంపై కేంద్రంకన్ను
లింకు ఎరువుల పరిమాణం పెంపు
ఆందోళనలకు సిద్ధమవుతున్న డీలర్లు
దిక్కుతోచనిస్థితిలో అన్నదాతలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎరువుల విక్రయాల్లో కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడుతోంది. కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తూ రైతులపై భారం మోపుతోంది. ప్రయివేటు డీలర్లపై రవాణా చార్జీలు పడుతుండటంతో ఆ భారాన్ని వారు రైతులపై వేస్తున్నారు. మరోవైపు లింకు ఎరువుల పరిమాణం పెంపుతోనూ డీలర్లు సతమతం అవుతున్నారు. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోంది. దీనిలో భాగంగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియా, డీఏపీల వాడకాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతోంది. లింకు ఎరువుల పరిమాణం పెంపును దీనికొక ఆయుధంగా వాడుతోంది. రూ.6 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తేనే రూ.లక్ష యూరియా సరఫరా చేస్తామని షరతు పెడుతుంది. రవాణా చార్జీల భారాన్ని డీలర్లపైనే వేస్తుంది. ఫలితంగా డీలర్లు బస్తా ఎరువుపై రూ.30 అదనపు చార్జీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రయివేటు డీలర్లకు యూరియా, డీఏపీ సరఫరాను కంపెనీలు తగ్గించాయి. రెండేండ్లుగా లింకు ఎరువుల పరిమాణాన్ని పెంచుతూ యూరియా, డీఏపీకి ఆరు రెట్లు అదనంగా కాంప్లెక్స్ ఎరువులు విక్రయించాలని కంపెనీలు కండీషన్ పెడుతున్నాయి. మార్క్‌ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ సేవా సంస్థలు, మన గ్రోమోర్, హాకా వంటి ప్రభుత్వరంగ సంస్థలపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. డీలర్లపై పడే భారాన్ని మాత్రం అంతిమంగా రైతులపైనే మోపుతున్నారు.
సరఫరా చేసే ఎరువులోనూ దాదాపు 60శాతానికి పైగా ప్రభుత్వ రంగ సంస్థలకే పంపుతున్నారు. 40శాతం మాత్రమే ప్రయివేటు డీలర్లకు కేటాయిస్తున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 60వరకు ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా ఎరువుల డీలర్లు 200 మంది వరకు ఉన్నారు. 60 వరకు ఉన్న పీఏసీఎస్‌లకు 60 శాతం పంపుతుండగా, 200 వరకు ఉన్న ప్రయివేటు డీలర్లకు మాత్రం కేవలం 40 శాతం ఎరువునే సరఫరా చేస్తుండటంపై ఆవేదన చెందుతున్నారు. సబ్సిడీ రూపంలో యూరియా బస్తాపై రూ.1300 వరకు కేంద్రం భరించాల్సి వస్తోంది. దీన్ని వదిలించుకొనేందుకు నానో యూరియాను ప్రోత్సహిస్తోంది. ఎకరానికి సరిపడా అర లీటర్ నానో యూరియా బాటిల్ రూ.225 మాత్రమే పలుకుతుండటంతో రైతులను ఈ దిశగా తీసుకెళ్లేందుకు డీలర్లకు టార్గెట్లు పెడుతుంది. ఖమ్మం నుంచి వివిధ జిల్లాలకు సరఫరా అయ్యే వ్యాగన్ పాయింట్‌ను కూడా పందిళ్లపల్లికి మార్చడంతోనూ కొంతమేర రవాణా చార్జీలు పెరిగాయి.
విక్రయాలు నిలిపివేయాలని డీలర్ల తీర్మానం
కేంద్ర ప్రభుత్వ కొర్రీలతో డీలర్లు సతమతం అవుతున్నారు. వడ్డీలకు తెచ్చి అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. నిల్వ ఉంచే స్థాయిలో ఎరువుల సరఫరా లేదని చెప్తున్నారు. ఇలాంటి సమస్యలతోనే ఆంధ్రప్రదేశ్‌లో యూరియా, డీఏపీ విక్రయాలను ఆ రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ నిలిపేసింది. తెలంగాణలోనూ ఈనెల 10లోగా మండల, జిల్లా స్థాయి డీలర్ల అభిప్రాయాలు సేకరించాలని రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 800 మంది వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు ఉన్నారు. ఇప్పటికే మండల అసోసియేషన్‌లతో జిల్లా అసోసియేషన్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఖమ్మం అర్బన్, తల్లాడ, చింతకాని, వైరా తదితర 8కి పైగా మండలాల్లో 10వ తేదీ నుంచి ఎరువుల అమ్మకాలను నిలిపివేయాలని ఆయా అసోసియేషన్‌లు తీర్మానించాయి.
సబ్సిడీల్లో భాగంగా రవాణా చార్జీలు భరించాలి
పుల్లఖండం నాగేంద్రరావు, ఎరువుల డీలర్ల అసోసియేషన్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు
లింకు ఎరువుల పద్ధతిని విడనాడాలి. దీనిపై స్టేట్ డీలర్స్ అసోసియేషన్ మండల, జిల్లా స్థాయిల్లో అభిప్రాయాలు సేకరిస్తోంది. అక్కడి నుంచి వచ్చే ప్రతిస్పందనలను బట్టి ఎరువుల విక్రయాల నిలిపివేతపై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ఎరువుల వినియోగం బాగా ఉంది. రాష్ట్రం మొత్తం ఎరువుల వాడకం పెరిగే లోగానే దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డీలర్స్ అసోసియేషన్ భావిస్తోంది. దీనిలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నా రు. ఈనెల 10వ తేదీ నాటికి ఓ స్పష్టత రాకపోతే రాష్ట్ర అసోసియేషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
సరఫరాలో కోత
పంటలు మొక్క దశలో ఉన్నప్పుడు నానో యూరియా, డీఏపీ వినియోగించాలి. దీనికి ముందు ఘన రూపంలో ఉన్న యూరియాను ఉపయోగించాలని కేంద్రం
సూచిస్తుంది. అయినా రైతులు నేలల్లో వేసే సంప్రదాయ రీతి ఎరువుల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం సగానికి సగం ఘన రూప యూరియా, డీఏపీ ఎరువును తగ్గించాలని నిర్ణయించింది.
ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో సరఫరా చేయాల్సిన 3 లక్షల టన్నులకు 1.80 లక్షల టన్నులు మాత్రమే ఘన రూప ఎరువు సఫ్లరు చేశారు.