– తీర్పు రిజర్వ్‌లో ఉన్నా పట్టించుకోని కేంద్రం
న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 చెల్లుబాటును సవాలు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ముందు ఇప్పటికే పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి న్యాయస్థానం తన తీర్పును ఇప్పటికే రిజర్వ్‌లో ఉంచింది. అయితే, మోడీ సర్కారు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పోర్టల్, డేటాబేస్ నిర్వహణ, ఆస్తుల గణాంకాల నమోదు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం, ఆడిట్ నిర్వహణను నిర్దేశించే నియమాలను కేంద్రం నోటిఫై చేసింది. ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారికత, సామర్థ్య పెంపుదల, అభివృద్ధి నియమాలు (ఉమీద్) – 2025 అనే పేరుతో రూపొందించిన ఈ నిబంధనల్ని ప్రకటించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆధారంగా రూపొందించిన సెక్షన్ 108బి నిబంధన కింద ఈ నియమాలను రూపొందించారు. ఈ నియమాల ప్రకారం అన్ని రాష్ట్రాల వక్ఫ్ వివరాలను నమోదు చేసేందుకు ఒక పోర్టల్‌ను, డేటాబేస్‌ను ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ ఆస్తుల వివరాలను ఇందులో అప్‌లోడ్ చేస్తారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 48 కింద ఔకాఫ్ నిర్వహణ రిజిస్టరును, సంబంధిత వక్ఫ్ ముతవల్లి సమర్పించిన లెక్కలను కూడా పోర్టల్‌లో పొందుపరుస్తారు. కేంద్ర మైనారిటీల శాఖలో వక్ఫ్ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ సెక్రెటరీ ఈ పోర్టల్ పర్యవేక్షణ, నియంత్రణలకు బాధ్యత వహిస్తారని నోటిఫై చేసిన నిబంధనలు పేర్కొంటున్నాయి. అలాగే, అన్ని రాష్ట్రాలూ జాయింట్ సెక్రెటరీ స్థాయి కంటే తక్కువ కాని అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. కేంద్రంతో సంప్రదించి కేంద్రీకృత మద్దతు యూనిట్‌ను ఏర్పాటు చేయాలి.
వక్ఫ్ నిబంధనలు నోటిఫై
- Advertisement -
- Advertisement -