– నేటి నుంచి డీలర్ వద్ద నమోదుకు అవకాశం : రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్
– మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఔటర్ రింగ్ రోడ్డు లోపల నివాసముండే డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకొనేందుకు అవసరమైన సాప్ట్‌వేర్‌ను రూపొందించి.. ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. నిరుపేద కుటుంబాలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓఆర్‌ఆర్ లోపల నివసించే వారికి కొత్త ఎల్పీజీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు అనుమతిస్తూ.. జీవో 263ను విడుదల చేశారనీ, ఈ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేశామని రవాణాశాఖ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్ల వద్ద కొత్త ఆటోరిక్షా రిజిస్ట్రేషన్స్‌కు అవసరమైన నూతన సాఫ్ట్‌వేర్‌ను ఆదివారం నుంచే అందుబాటులోకి తీసుకువచ్చామని కమిషనర్ చెప్పారు. కొత్త ఆటో రిక్షా కొనుగోలు చేయలనుకునేవారు ఓర్‌ఆర్‌ఆర్ పరిధిలో ఉండి.. రాష్ట్రంలోని ఏ ఆటో రిక్షా డీలర్ వద్దనైనా కొనుగోలు చేయవచ్చునన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆటో రిక్షాలపై ఆంక్షలను ఎత్తివేస్తూ..65 వేల పర్మిట్లను ఇటీవల విడుదల చేసింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో 10 వేల సీఎన్‌జీ ఆటో పర్మిట్లు ఉండగా.. మరో 25వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ ఆటోలను రిట్రోఫిట్‌మెంట్ అమర్చుకొని ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
డీలర్‌కు సమర్పించాల్సిన పత్రాలు
1) దరఖాస్తుదారు (డ్రైవర్) తమ 3వీలర్ లైసెన్స్(ఆటో లైసెన్స్).. లైసెన్స్‌పై అడ్రస్ ప్రకారం.. లైసెన్స్‌దారుడు ఓఆర్‌ఆర్ లోపల నివసించే వారు ఉండాలి.
2) లైసెన్స్‌పై ఉన్న అడ్రస్‌తో పోలిన మరొక అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, కరెంట్ బిల్లు సమర్పించాలి.
3) ఒక వ్యక్తికి ఒక ఆటో రిక్షా పర్మిషన్ మాత్రమే. ఇంతకు ముందు అతని పేరుతో ఆటో రిక్షా ఉంటే వారు అనర్హులు.
4) తన పేరు మీద ఇంకొక ఆటో రిక్షా లేదని ధృవీకరణ అఫిడవిట్‌నూ డీలర్‌కు సమర్పించవలెను.
5) ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వీసు పద్దతిలో అప్రూవల్ ఇస్తారు.
6) అప్రూవల్ అయిన 60 రోజుల్లోగా వారి ఆటోరిక్షాను సదరు ఆర్టీఏ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేని పక్షంలో పర్మిషన్ రద్దు చేస్తారు.
డీలర్‌కు సూచనలు
1) తన వద్దకు వచ్చిన పత్రాలు క్షుణంగా పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఉన్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు డీలర్ లాగిన్‌లో నమోదు చేయాలి.
2) పత్రాలు క్షుణంగా పరిశీలించే బాధ్యత పూర్తిగా డీలర్‌దే.
3) పరిశీలన అనంతరం డీలర్ అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి
4) డీలర్‌పై ఎలాంటి ఫిర్యాదులు.. వాహనం ధర కంటే ఎక్కువకు అమ్మడం, ప్రాసెసింగ్ కోసమని అధిక ఫీజులు వసూలు చేయడం, బ్లాక్ మార్కెట్ చేయడం, బ్లాక్ చేయడం, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయడం లాంటి ఇతర ఫిర్యాదులు వస్తే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అనంతరం డీలర్ వద్ద నమోదు వివరాలు ఆన్‌లైన్ ద్వారా ఏ కార్యాలయానికి పంపించారో.. ఆ కార్యాలయ అధికారులు పరిశీలించి 24 గంటల్లోగా అప్రూవల్ లేదా తిరస్కరించడం చేస్తారు.
ఆటో రిజిస్ట్రేషన్స్ షురూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES