– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపణ
నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మార్చటానికి మాత్రమే కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్లుగా చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 12 గంటల పనిని అమలు జరపటానికి పూనుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాను పరిపాలించే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కార్మికుల పనిగంటలను పెంచుతూ.. నిర్ణయం చేసిందని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 282 జీవోను ఇచ్చి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని నిర్ణయించటం అంటే కార్మికుల ఆరోగ్యాలు, కుటుంబాల బాగోగులు ఫణంగా పెట్టి యజమానులకు బానిసలుగా మార్చటమే అవుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ పరిధిలోని వివిధ జోన్లలో మున్సిపల్ కార్మికులతో చర్చించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకు స న్నద్ధం అవుతున్న తరుణంలో మూలిగే నక్కపై రోకలి పోటు లాగా రాష్ట్ర ప్రభుత్వం 10 పనిని చేయించుకోవచ్చు అని అవసరమైతే 12 గంటలు కూడా పనిచేసుకోవటానికి వీలు కల్పిస్తూ జీవో ను విడుదల చేయటం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుదారుల ప్రయోజనాలు తప్ప కార్మికుల సంక్షేమం పట్టకుండా ఉన్నదని దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి, రవి, కిషన్, సహదేవ్, అమూల్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాలకై కార్మిక హక్కులను తాకట్టు పెడుతున్న బీజేపి కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES