Tuesday, July 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలురీల్స్ మోజు…ప్రాణాలతో చెలగాటమాడే స్టంట్లు

రీల్స్ మోజు…ప్రాణాలతో చెలగాటమాడే స్టంట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రీల్స్‌ మోజులో పడి చాలామంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.. చిన్నపిల్లల్లో కూడా రీల్స్‌ పిచ్చి పీక్‌కు చేరింది.. ఫేమస్‌ అవ్వడానికి ప్రాణాలతో చెలగాటమాడే స్టంట్లు చేస్తూ రీల్స్‌ మత్తులో జోగుతున్నారు. వారిని సోషల్‌ మీడియా మత్తు వైరస్‌లా పట్టి పీడిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా సోషల్‌ మీడియాకు ఎంత అడిక్ట్‌ అవుతున్నారు అనే దానికి నిదర్శనం ఈ తాజా ఘటన అని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌ లో పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎక్కడ జరిగిందంటే ?
ఒడిశాలోని బౌధ్‌ జిల్లాలో పురునపాణి స్టేషన్‌ సమీపంలోని దలుపాలి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్‌ బాలురను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టండ్‌ చేశాడు. దీన్ని స్నేహితులలో ఒకరు డైరెక్ట్‌ చేయగా, మరొకరు వీడియో తీశాడు. ఈ స్టంట్‌ను చేస్తున్న పిల్లాడు చప్పట్లతో కేరింతలు కొట్టాడు. బాలుడు లేచి నిలబడి ఫోటోలకు పోజు ఇచ్చాడు. స్నేహితులు ఆనందంతో కేకలు వేస్తుండటం చూడవచ్చు. దీన్ని గమనించిన పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని, భద్రతా చట్టాలను ఉల్లంఘన అని హెచ్చరించారు. అలాగే సోషల్‌ మీడియాలో తమ పిల్లల వ్యవహారాన్ని ఒక కంట కనిపెట్టాలని తల్లిదండ్రులను కోరారు. అయితే ట్రాక్‌లపై పడుకున్న బాలుడు స్పందించాడు. ఇలా చేస్తే ఈ రీల్‌ వైరల్‌ అవుతుందని తన స్నేహితులు చెప్పారని, ట్రాక్‌పై ఉండగా, మీద నుంచి రైలు వెళుతున్నపుడు, గుండె వేగంగా కొట్టుకుందని, బతుకుతానని ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. కాగా వెర్రి తలలు వేస్తున్న సోషల్‌ మీడియా ధోరణులపై నెటిజనులను హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు…

వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ పోస్టులో … ” చిన్నతనం నుంచే రీల్స్‌ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం. సోషల్‌ మీడియా మత్తులో పడి ఫేమస్‌ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఇలాంటి సోషల్‌ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సోషల్‌ మీడియాకి అడిక్ట్‌ అయిన పిల్లలకు కౌన్సెలింగ్‌ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. బిజీ లైఫ్‌ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్‌ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి.” అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -