Tuesday, July 8, 2025
E-PAPER
Homeబీజినెస్మహీంద్రా, హిరోషిమా యూనివర్శిటీల భాగస్వామ్యం

మహీంద్రా, హిరోషిమా యూనివర్శిటీల భాగస్వామ్యం

- Advertisement -

హైదరాబాద్, జూలై 7, 2025: మహీంద్రా యూనివర్శిటీ జపాన్‌లోని ప్రఖ్యాత హిరోషిమా యూనివర్శిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఒప్పందంపై మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మెదురి, హిరోషిమా యూనివర్శిటీ అధ్యక్షులు డాక్టర్ మిత్సుఓ ఓచిలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ స్థాయి విద్యా నైపుణ్యం, పరిశోధన ఆవిష్కరణ, సాంస్కృతిక మార్పిడికి ఇది ఒక ముందడుగుగా చెప్పవచ్చు. ఈ భాగస్వామ్యంలో 3+1 ఇంజనీరింగ్ అండర్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఉంది. ఇందులో విద్యార్థులు మొదటి మూడు సంవత్సరాలు హైదరాబాద్‌లో, చివరి సంవత్సరం హిరోషిమా యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తారు. జపాన్‌లో గడిపే సమయంలో కోర్సు పూర్తి చేయడమే కాకుండా గ్రాడ్యుయేషన్ థీసిస్‌ను కూడా రూపొందించాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు హిరోషిమా యూనివర్శిటీ నుంచి ఒక సర్టిఫికెట్, మహీంద్రా యూనివర్శిటీ నుంచి తుది డిగ్రీ లభిస్తుంది. హిరోషిమాలో పొందిన క్రెడిట్స్‌ను మహీంద్రా యూనివర్శిటీ తుది డిగ్రీలో విలీనం చేస్తుంది. మహీంద్రా యూనివర్శిటీకి చెందిన తొలి బ్యాచ్ విద్యార్థులు 2026 విద్యా సంవత్సరంలో హిరోషిమాలో తుది సంవత్సరం చదువును ప్రారంభించనున్నారు. ఈ అరుదైన అవకాశానికి ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. విద్యార్థులు హిరోషిమా యూనివర్శిటీలో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. పరీక్షా ఫీజు, ప్రవేశ ఫీజును యూనివర్శిటీ మాఫీ చేయనుంది.

     ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మెదురి మాట్లాడుతూ పరిశోధనలో అగ్రగామిగా ఉన్న హిరోషిమా యూనివర్శిటీతో భాగం కావడం గర్వంగా ఉందన్నారు. విద్య అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న మా లక్ష్యంలో ఇది ఒక కీలకమైన మైలురాయి అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా మా విద్యార్థులు హిరోషిమాలో చివరి సంవత్సరం చదవడం అకడమిక్, సాంస్కృతికంగా ఎంతో ప్రయోజనకరం అన్నారు. పరస్పర సంబంధాలతో నడిచే ప్రపంచంలో గ్లోబల్ నిపుణులను తయారు చేయడమే ఉమ్మడి లక్ష్యమన్నారు. ఈ డిగ్రీతో పాటు ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుల ప్రోత్సాహం, అధ్యాపకులు, పరిపాలన సిబ్బంది మార్పిడి, అండర్‌గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థుల పరస్పర మార్పిడి, అకడమిక్ ప్రచురణలు, పరిశోధన ఫలితాల పరస్పర వినిమయం కూడా ఉంటాయన్నారు.

     ఈ సందర్భంగా హిరోషిమా యూనివర్శిటీ అధ్యక్షులు డాక్టర్ మిత్సుఓ ఓచి మాట్లాడుతూ విద్యా ప్రావీణ్యాన్ని పెంపొందించనున్నామని తెలిపారు. యువ ప్రతిభను నైపుణ్యంగా తీర్చిదిద్దడం, ప్రపంచ ప్రాధాన్యత గల అంశాలపై ఉమ్మడిగా పరిశోధనలు చేయడం లక్ష్యమన్నారు. హిరోషిమా విశ్వవిద్యాలయం ప్రపంచ విద్యా నెట్‌వర్క్‌లోకి మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ భాగస్వామ్యం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ డీన్, అకడమిక్స్ అండ్ ఆర్ & డీ, ఎకోల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ విశాలాక్షి తలకొకుల, డీన్, సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్ డాక్టర్ రాజిందర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. —

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -