జీఓ 282 వెంటనే ఉపసంహరించుకోవాలి : సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ- ఖమ్మం
దేశవ్యాప్తంగా ఈ నెల 9న చేపట్టబోయే సార్వత్రిక సమ్మెతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, దానికోసం కార్మికులందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ(ఎం) ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీచౌక్, మార్కెట్ కార్మికులతో 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం కోరుతూ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నదే తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చారని అన్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు.. లాంటివి లేబర్ కోడ్‌ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేశారని ఆరోపించారు కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్‌లకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారన్నారు. కార్మికులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలన్నారు.
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్థన్, నాయకులు వై.విక్రమ్, భూక్యా శ్రీనివాసరావు, బండారు యాకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, సీఐటీయూ త్రీ టౌన్ కన్వీనర్ యర్రా మల్లికార్జున్, సిటీ హమాలి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెతో మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES