Tuesday, July 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకే.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకే.

- Advertisement -

పదేండ్లు వారిని విస్మరించారు
ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
వనమే మనం, మనమే వనం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఘనంగా వన మహౌత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి, వారిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేండ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలను విస్మరించిందని ఆరోపించారు. ఈ ఏడాది 18కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలోని బయోడైవర్సిటీ పార్కులో వన మహౌత్సవ కార్యక్రమం నిర్వహించారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి రుద్రాక్ష మొక్కను సీఎం నాటి వనమహౌత్సవం-2025ను ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. వనమే మనం, మనమే వనం అని పెద్దలు చెప్పారని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని దేశ ప్రధాని పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపును ఆహ్వానిస్తూ.. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని అన్నారు. అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఐదేండ్లు క్యాబినెట్‌లో మహిళా మంత్రి కూడా లేరని విమర్శించారు. మహిళలను ప్రోత్సహిస్తూ తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి, వారిని బస్సులకు యజమానులను చేశామని తెలిపారు. హైటెక్‌ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరేలా కృషి చేయాలన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. అన్నిరంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. చెట్లను పెంచడం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు. అడవుల్లో చెట్లను నరకడం వల్ల కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయని, అటవీ సంపద పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భౌగోళిక పరిస్థితి మెరుగుపడే విధంగా రాష్ట్రమంతా విరివిగా వనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు, నరసింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలతశోభన్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -