Tuesday, July 8, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -

‘స్థానిక’ ఎన్నికలు, రిజర్వేషన్లు, రేషన్‌ కార్డులే ప్రధాన ఎజెండా
ఢిల్లీ నుంచి సీఎం వచ్చాక ఖరారు చేయనున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రతీనెలా రెండుసార్లు రాష్ట్ర మంత్రివర్గాన్ని సమావేశపర చాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం మేరకు ఈనెల 10న క్యాబినెట్‌ భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, కాళేశ్వరం కమిషన్‌ విచారణ, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తదితరాంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. విధానపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నెలకు రెండుసార్లు క్యాబినెట్‌ను సమావేశపరుస్తామంటూ సీఎం ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అయింది. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి వెంటనే ఎన్నికలు జరపాలనే డిమాండ్‌ ఊపందుకుంది. ఇదే అంశంపై ప్రభుత్వం… ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, పింఛన్లు తదితర కీలకాంశాలు క్షేత్రస్థాయిలో ప్రతికూలంగా మారాయని అధికార పార్టీ భావించింది. రైతు బంధును విడతల వారీగా చెల్లించటం, రైతు రుణమాఫీ ప్రక్రియను కూడా చేపట్టటంతో ఇప్పుడు పరిస్థితి తమకు అనుకూలంగా ఉందనేది ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రుల అంచనా. ఈ అంచనాతోనే మండల ప్రజా పరిషత్‌ల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టాలంటూ తాజాగా పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలను జారీ చేసింది. సంబంధిత డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల కానుంది. వచ్చే క్యాబినెట్‌లో ఈ అంశంపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను రాబట్టాలంటే కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు, ఉన్న పింఛన్ల పెంపుదల చేపట్టాలంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. వీటితోపాటు బీసీ రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా కూలంకుషంగా చర్చిస్తారని సమాచారం. అయితే ఢిల్లీలో ఉన్న సీఎం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతే ఈ అజెండాకు తుది రూపునిచ్చి, ఖరారు చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రికి ఆయన నగరానికి చేరుకుంటారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -