Tuesday, July 8, 2025
E-PAPER
Homeజాతీయంమళ్లీ మొబైల్‌ చార్జీల మోత !

మళ్లీ మొబైల్‌ చార్జీల మోత !

- Advertisement -

10-12 శాతం పెరిగే అవకాశం
పరిశ్రమ వర్గాల అంచనా
మోడీ సర్కార్‌ అండతో
నెట్‌వర్క్‌ కంపెనీల బాదుడు
న్యూఢిల్లీ :
గతేడాది భారీగా మొబైల్‌ చార్జీలను పెంచిన ప్రయివేటు టెలికం కంపెనీలు మరోమారు వినియోగదా రులను బాదడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2024 జులైలో 30 శాతం వరకు రీచార్జీల ధరలను పెంచిన టెల్కోలు తాజాగా మరో 10-12 శాతం పెంచే యోచనలో ఉన్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. టెలికం పరిశ్రమలో పోటీ, టెక్నాలజీ కోసం పెట్టుబడులు పెరిగాయనే సాకుతో బీజేపీ ప్రభుత్వ మద్దతుతో మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు టారిఫ్‌ ధరలను పెంచుతూ పోతున్నాయి. 5జీ సేవల విస్తరణ,వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి నేపథ్యంలో ఈ దఫా చార్జీల పెంపు జరిగే అవకాశముందని సమాచారం. గడిచిన మే నెలలో కొత్తగా 74 లక్షల మంది వినియోగదారులు జోడించబడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా యాక్టివ్‌ మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 108 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచే దిశగా కసరత్తులు ప్రారంభించాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్‌ వెల్లడించింది. కాగా ఈ దపా బేసిక్‌ ప్లాన్లపై స్వల్ప పెరుగుదల ఉండొచ్చని.. మధ్య స్థాయి, ప్రీమియం ప్లాన్‌లపై మాత్రం చార్జీల దండింపు గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు రీచార్జీ ప్లాన్లలో డేటా పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వినియోగదారులు ఉపయోగించే డేటా పరిమాణం, డేటా వేగం, డేటా వినియోగ సమయాలు వంటి అంశాల ఆధారంగా ఛార్జీలను పెంచే ప్రణాళికను సంస్థలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటా ప్యాక్‌లను వినియోగదారులు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు రావొచ్చని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. మొబైల్‌ టారిఫ్‌లలో మార్పులు అవసరమని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థల ప్రతినిధులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటి టారిఫ్‌లు వినియోగదారుల అప్‌గ్రేడేషన్‌ అవసరాలకు సరిపోవడం లేదని ఇటీవల ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విట్టల్‌ పేర్కొన్నారు.పలు ప్రపంచ దేశాల వినియోగదారుల సగటు మొబైల్‌ బిల్‌ వ్యయంతో పోల్చితే భారత్‌లో తక్కువ ధరలు ఉన్నాయని టెలికం కంపెనీల ప్రధాన వాదన. అందులో ప్రధానంగా సింగపూర్‌, మలేషియా, చైనా, ఫిలిప్పిన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల వినియోగదారుల సగటు వ్యయంతో పోల్చితే భారత్‌లో తక్కువ మొబైల్‌ చార్జీలు అమల్లో ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే ఆయా దేశాల ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం అత్యల్పమన్న విషయాన్ని టెలికం కంపెనీలు చెప్పడం లేదు. అదే విధంగా భారత్‌తో పోల్చితే ఆయా దేశాల్లో వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ. భారత్‌లో వాడకందారులు ఎక్కువ కాబట్టి.. ఛార్జీలు తక్కువగా ఉన్న ఎక్కువగా రెవెన్యూ వస్తుందనేది వాస్తవం. గతేడాది జులైలో పెంచిన 30 శాతం ధరలతో వినియోగదారులపై ఇప్పటికే తీవ్ర భారం పడింది. మరోసారి పెంచితే ప్రజల ఆదాయాలకు గండి కొట్టడం ద్వారా వారి కొనుగోలు శక్తిని హరించడమే కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -