– క్వార్టర్స్‌లో సీగ్మండ్‌పై గెలుపు
– వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2025
నవతెలంగాణ-లండన్
మహిళల సింగిల్స్ వరల్డ్ నం.1, టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సబలెంక ప్రీ క్వార్టర్స్ వరకు చెమట పట్టకుండా విజయాలు సాధించింది. కానీ క్వార్టర్‌ఫైనల్లో టాప్ సీడ్‌కు జర్మనీ ముద్దుగుమ్మ లారా సీగ్మండ్ చెమటలు పట్టించింది. మూడు సెట్ల పాటు సాగిన మ్యాచ్‌లో అరినా సబలెంక 4-6, 6-2, 6-4తో సీగ్మండ్‌పై గెలుపొందింది. రెండు ఏస్‌లు, ఎనిమిది బ్రేక్ పాయింట్లతో మెరిసిన సబలెంక పాయింట్ల పరంగా 104-94తో పైచేయి సాధించింది. వరల్డ్ నం.1ను తొలి సెట్లో ఓడించిన లారా సీగ్మండ్.. అదే జోరు రెండో సెట్లో చూపించలేదు. నాలుగుసార్లు సర్వ్‌ను చేజార్చుకుని మ్యాచ్‌ను వదిలేసింది. నిర్ణయాత్మక మూడో సెట్లో సబలెంక ఉత్తమ ప్రదర్శన చూపించింది. 4-4తో సీగ్మండ్ రేసులో నిలిచినా.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్ పాయింట్లను సొంతం చేసుకుంది. సీగ్మండ్ టైబ్రేకర్‌కు ప్రయత్నించినా.. ఒత్తిడిలో సబలెంక ఆకట్టుకుంది. ఏస్‌లు, ర్యాలీలు, ఫోర్ హ్యాండ్ షాట్లతో చెలరేగింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్, టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్ (పొలాండ్) మెరిసింది. 6-4, 6-1తో క్లారా టాసన్ (డెన్మార్క్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో లామ్సోనోవతో స్వైటెక్ తలపడనుంది.
టేలర్ ఫ్రిట్జ్ జోరు
అమెరికా ఆటగాడు, ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ జోరు కొనసాగుతుంది. కఠిన ప్రత్యర్థులను దాటుకుంటూ వస్తోన్న టేలర్ ఫ్రిట్జ్ క్వార్టర్‌ఫైనల్లోనూ సాధికారిక విజయం సాధించాడు. రష్యా ఆటగాడు కారెన్ కచనోవ్‌పై నాలుగు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు. 6-3, 6-4, 1-6, 7-6(7-4)తో కచనోవ్‌పై టేలర్ పైచేయి సాధించాడు. 16 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో చెలరేగిన టేలర్ ఫ్రిట్జ్ తొలి రెండు సెట్లను అలవోకగా నెగ్గాడు. కానీ మూడో సెట్‌ను కైవసం చేసుకున్న కచనోవ్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. కచనోవ్ ఆరు ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో ఆకట్టుకున్నా.. కీలక నాల్గో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయాడు. అంతకముందు, పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, వరల్డ్ నం.1 జానిక్ సినర్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్‌తో ప్రీ క్వార్టర్స్‌లో 3-6, 5-7, 2-2తో వెనుకంజలో కొనసాగిన సినర్… దిమిత్రోవ్ గాయంతో తప్పుకోవటంతో గట్టెక్కాడు. సినర్ సైతం ఎల్బో గాయంతో ఇబ్బంది పడినా.. మూడో సెట్లో దిమిత్రోవ్ కుడి వైపు చాతి కండరాల నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో తక్షణ ఉపశమనం అందించినా.. మ్యాచ్‌ను కొనసాగించేందుకు దిమిత్రోవ్ సుముఖత చూపలేదు. దీంతో జానిక్ సినర్ నేరుగా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్స్ వరకు ప్రత్యర్థులకు కేవలం 17 గేములనే కోల్పోయిన సినర్.. దిమిత్రోవ్ ముందు తలొంచేలా కనిపించాడు. నొప్పితో కిందపడిన దిమిత్రోవ్‌ను సినర్ దగ్గరుండి చూసుకోవటం వింబుల్డన్ సెంటర్ కోర్టులో అభిమానులను ఆకర్షించింది.
సెమీస్‌లో సబలెంక
- Advertisement -
- Advertisement -