Wednesday, July 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురామయ్య భూమిలో గూండాగిరి!

రామయ్య భూమిలో గూండాగిరి!

- Advertisement -

890 ఎకరాలు కబ్జా చేసేందుకు దౌర్జన్యం..
అక్రమంగా నిర్మాణాలు
ఆలయ ఈవో, దేవస్థాన అర్చక సిబ్బందిపై దాడి
దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాలు
నవతెలంగాణ-భద్రాచలం

సాక్షాత్తు రామయ్య భూములనే కబ్జా చేయాలని పథకం రచించి అమలుపరుస్తున్న పురుషోత్తపట్నంకు చెందిన కబ్జాదారులు ఆలయ భూముల రక్షణ కోసం వెళ్ళిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆలయ ఈఓ ఎల్‌.రమాదేవితో పాటు అర్చకులపైనా దాడి చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్త పట్నంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి చెందిన సుమారు 1500 ఎకరాల భూమి పురుషోత్తపట్నంలో ఉంది. అందులో 889.50 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారు. ఆ భూమిపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా 2022లోనే ఆ భూములు దేవస్థానానికి చెందినవని, ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా యధాస్థితిలో దేవస్థానానికి అప్పజెప్పాలని ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆ ఉత్తర్వులు అమలు చేసేందుకు స్థానిక పోలీసులు సహకరించని నేపథ్యంలో దేవస్థానం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. అంతేకాకుండా సుమారు 250 పైగా వివిధ న్యాయస్థాన పరిధిలో కేసులు వేయగా అన్ని కేసుల్లో ఆయా భూములు దేవస్థానానికి చెందుతున్నాయని తీర్పులు ఇచ్చాయి. అయినా ఆక్రమణలు ఆగటం లేదు. ఈ దశలో సోమవారం దేవస్థానం అధికారులు దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాల వద్దకు వెళ్లారు. జరుగుతున్న పరిణామాలపై ఆలయ ఈవో మంగళవారం సిబ్బందితోపాటు అర్చక స్వాములను కలుపుకొని నిర్మాణాలు చేపట్టే వారితో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ఎట్టపాక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న గారపాటి చంద్రశేఖర్‌, పంద అఖిల్‌ రెడ్డి, సార్‌ రెడ్డి శ్రీనివాసరెడ్డి, భార్గవ్‌ మణికంఠ తదితరులు కొంతమ ంది స్థానికులను, తన ప్రధాన అనుచర గణాలను రెచ్చగొట్టి ఈవోతో పాటు సిబ్బందిపై భౌతిక దాడికి దిగారు. జరిగిన ఘర్షణలో ఆలయ ఈవో రమాదేవితో పాటు అర్చకులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని భద్రాచలం పట్టణ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యాన్ని అందిస్తు న్నారు. దేవస్థాన అధికారులపై దాడి జరుగుతుందని సమాచారం ఉన్న ఎట్టపాక పోలీసులు స్పందించ లేదు. కేవలం ఇద్దరు సాధారణ కానిస్టేబుళ్లను మాత్రమే పంపించారని, వచ్చిన కానిస్టేబుల్స్‌ సైతం ప్రేక్షక పాత్ర వహించారే తప్ప దాడిని నియంత్రించేందుకు ఏమాత్రం ముందుకు రాలేదని దేవస్థానం ఉద్యోగులు ఆరోపిస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తమ నిరసన తెలిపారు. సరిహద్దు వివాదాన్ని ఆసరాగా తీసుకొని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ హౌదాలో ఉన్న మహిళా ఉద్యోగిపై దాడి చేసినా ఏపీ ప్రభుత్వ అధికారులు గానీ, పోలీస్‌ సిబ్బంది గానీ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రామనామ జపం చేసే బీజేపీ నేతృత్వంలో ఉన్న కూటమి సర్కార్‌ రామయ్య భూములను రక్షిస్తుందో.. కబ్జాదారులకు అండగా నిలుస్తుందో వేచి చూడాలి.


దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాలు
ఆలయ ఈవో రమాదేవితో పాటు సిబ్బంది అర్చక స్వాములపై ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆ సంఘం అధ్యక్షకార్యదర్శులు డెక్క నరసింహారావు, గుగిరి బాలకృష్ణ నవతెలంగాణతో మాట్లాడుతూ.. ఉద్యోగులపై దాడి హేయమైన చర్య అని అన్నారు. దేవస్థాన భూములను రక్షించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కబ్జాలను అడ్డుకున్న అధికారులపై దాడులు చేస్తే ఉద్యోగ సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.

దేవాదాయ భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు

ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో కబ్జాకు గురవుతున్న దేవాదాయ భూములను రక్షించేందుకు వెళ్లిన భద్రాచలం ఈఓ రమాదేవి కొందరు దాడి చేయడాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. దేవాదాయ భూములను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమనీ, పీడీ యాక్టులు తెరుస్తామని హెచ్చరించారు. రమాదేవిని మంత్రి ఫోన్‌లో పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషోత్తమపట్నం ఘటన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.


అసలు విషయమేంటంటే…
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో 889.5 ఎకరాల భూమున్న విషయం విదితమే. ఆ భూమిలో అనుమతి లేకుండా కొందరు భవన నిర్మాణాలు చేపట్టారు. భద్రాచలం దేవాలయ సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో తరచూ ఘర్షణ జరుగుతున్నది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు. పురుషోత్తపట్నంలోకి ప్రవేశించే మార్గంలో ఫిల్లర్లతో నిర్మాణ పనులు చేపడుతున్నారనే సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణం చేయవద్దనీ, ఇది పూర్తిగా రాముడి భూమి అని వివరించారు. కోర్టు తీర్పులతో దేవుడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని వెల్లడించారు. అయితే, ఈవో అభ్యంతరాలు వినకుండా… స్థానికులు ఈవోపై దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. గాయాలయ్యాయి.


రమాదేవిపై దాడిని ఖండిస్తున్నాం : ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్‌ వి.లచ్చిరెడ్డి
భద్రాచలం దేవాలయ ఈఓ రమాదేవిపై కొందరు దాడి చేయడాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్‌, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -