– మద్దతు కోరిన మందకృష్ణ
– మాదిగ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 13న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని మందకృష్ణ కలిశారు. పలు అంశాలపై చర్చించారు. వికలాంగుల పోరాటానికి మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో జాన్‌వెస్లీ మాట్లాడుతూ వికలాంగులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్ రూ.ఆరు వేలు, ఆసరా పెన్షన్ రూ.నాలుగు వేలకు పెంచాలని కోరారు. 18 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆగస్టు 13న వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. వికలాంగుల ఉద్యమానికి అండగా ఉంటామని అన్నారు.
తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలి : మంద కృష్ణ
వికలాంగులు, ఆసరా పెన్షన్‌దారులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మందకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్ రూ.ఆరు వేలు, ఆసరా పెన్షన్ రూ.నాలుగు వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తీవ్ర వైకల్యం (ఇతరుల సహాయం అవసరమైన వారు) ఉన్న వారికి పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్‌దారులందరికీ దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి మంజూరు చేయాలని చెప్పారు. ఏఐసీసీ ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు వెంటనే రాజకీయ రిజర్వేషన్‌ను ప్రకటిస్తూ చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ద్వారానైనా అమలు చేయాలని సూచించారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని వివరించారు.
ప్రతి వికలాంగునికీ రూ.50 లక్షల ఆరోగ్య భద్రత బీమా కార్డులివ్వాలని కోరారు. వికలాంగులకు ఇంటిస్థలం కేటాయించాలనీ, అనుకూలమైన వాతావరణంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఉపాధి హామీ చట్టంలో పనిదినాలను 150 నుంచి 200లకు కల్పించి తేలికపాటి పనులను వారికివ్వాలని చెప్పారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతులు రూ.ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. వారి పిల్లలకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని వివరించారు. వివాహంతో సంబంధం లేకుండా అంత్యోదయ కార్డు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి జగదీశ్, నాయకులు కోట రమేష్, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, చైర్మెన్ ఎల్ గోపాల్, జాతీయ కోర్‌కమిటీ వైస్ చైర్మెన్లు కొల్లి నాగేశ్వర్‌రావు, అందె రాంబాబు, ముసాయిదా కమిటీ వైస్ చైర్మెన్ చెరుకు నాగభూషణం, జాతీయ నాయులు వంశరాజ్ రాంచందర్, రాష్ట్ర నాయకులు వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 13న వికలాంగుల చలో హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES