ఆకట్టుకున్న ఆయిల్ ఫాం హాప్ టైప్ మొక్క,నాసిరకం గెలలు ప్రదర్శన…
లేబర్ కోడ్ లు తో హక్కులు కోల్పో నున్న కార్మికులు – సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట : బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే వివిధ రంగాల ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగుల కార్మికుల జీవితాలు పెను ప్రమాదంలో పడతాయని, ఉన్న కొద్దిపాటి కార్మిక హక్కులు కు శ్రమజీవులు దూరమవుతారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే పుల్లయ్య అన్నారు.
దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ,టీయూసీఐ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె ప్రారంభం సమావేశం మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అద్యక్షతన నిర్వహించారు.
ఇందులో సీపీఐ రాష్ట్ర నాయకులు సలీం,మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే పుల్లయ్య మాట్లాడుతూ అనేక ఏళ్లుగా శ్రామిక ప్రజానీకం తమ హక్కుల కోసం దోపిడీ కి వ్యతిరేకంగా రక్తం చిందిస్తేనే 8 గంటల పని దినం అమల్లోకి వచ్చిందని అన్నారు. అధిక పని గంటల భారం కార్మికులపై మోపడం ద్వారా పారిశ్రామిక యాజమాన్యాలు మరింతగా లాభ పడడానికి ఉపయోగపడతాయని అన్నారు.
ఈ లేబర్ కోడ్ లు అమలు అయితే కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం మరింత కష్టతర మవుతుందని,ఇప్పటికే ఈ విధానాలు అమలు జరిగే రాష్ట్రాలలో కార్మిక సంఘాలను ఏకపక్షంగా రద్దు చేయడం,కార్మిక నాయకులను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తుందని అన్నారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్ల కు తాకట్టు పెట్టే ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు.
ముందుగా మండల పరిషత్ పూర్వ కార్యాలయం నుండి అశ్వారావుపేట – భద్రాచలం రోడ్ లో పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు తిరిగి మూడు రోడ్ల ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కే. నరసింహారావు, జలాల్, బుచ్చి రాజు, రామకృష్ణ, విజయ్, రాధ, భారతి, యామిని, సోడెం ప్రసాద్, బి.చిరంజీవి, వెంకటప్పయ్య, ఏసు, నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె లో ఏఐకేఎస్ వినూత్న ప్రదర్శన :
వామ పక్షాల పిలుపు మేరకు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నిర్వహించిన సమ్మె సందర్భంగా ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫాం రైతుసంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన లో జన్యు లోపం తో ఉన్న ఆయిల్ పామ్ మొక్క,గెలలు కార్మిక కర్షక శ్రేణులను ఆకర్శింశించింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హాఫ్ (పూత కాత లేని) టైప్ మొక్కల విషయం, ప్రధానం గా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో ఈ మొక్కలు తో పెద్ద ఎత్తున రైతులు నష్ట పోయిన సంగతి విదితమే. దీన్ని ప్రతిబింబించే విధంగా హాఫ్ టైప్ మొక్క,గెలలు తో ప్రదర్శన సమ్మె కారుల్లో ఆసక్తి రేపింది.దీనిపై భాదిత రైతులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

