Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ ప్రాజెక్టులపై సీఎం తప్పుడు ప్రచారం

పెండింగ్‌ ప్రాజెక్టులపై సీఎం తప్పుడు ప్రచారం

- Advertisement -

– మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కృష్ణా బేసిన్‌లో పెండింగ్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌ సాక్షిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని అభిప్రాయపడ్డారు. కుక్కతోక వంకర అన్నట్టు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. తమను చర్చకు పిలిచే దమ్ములేకనే ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ, శాసనమండలిలో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తామని పేర్కొన్నారు. పంపులు ఆన్‌ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని తాము కోరితే…అది పక్కన పెట్టి అబద్ధాలను చెబుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పనికిరాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలతో, తప్పుడు మాటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేయడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతిపక్షాలపై నిందారోపణలు చేసేందుకు ఇంత నీచమైన స్థాయికి దిగజారుతారా? అని ప్రశ్నించారు. సీఎం చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్ధమేనని తెలిపారు. తెలంగాణవాదులు బయట ఉంటే, ద్రోహులు ప్రజాభవన్‌లో చేరి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల, సాగు రంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్‌లో అధికారికంగా నిర్వహించిన నేటి సమావేశానికి పార్టీ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. నీటిపారుదలపై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్‌రెడ్డి…ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ సవాల్‌లో నిజాయితీ ఉంటే ఎందుకు ప్రజాభవన్‌కు తమను ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఇది ఎమ్మెల్యేల హక్కులకు భంగం కల్పించడమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వంతెనలు కూలితే విచారణలు ఉండవా?
బీజేపీ, ఎన్‌డీఏ పాలిత బీహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో వంతెనలు కూలిపోతే అక్కడ ఎలాంటి విచారణలు ఉండవా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే, రెండు రోజుల్లో ఎన్డీఎస్‌ఏ వచ్చి హడావిడిగా విచారణ చేపట్టిందని ఒక ప్రకటనలో విమర్శించారు. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మిస్తున్న పోలవరంలో డయాఫ్రమ్‌ వాల్‌, కాపర్‌ డ్యాం, గైడ్‌ బండ్‌ కొట్టుకుపోయినా విచారణ చేయలేదని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో కుప్ప కూలిన ఎస్‌ఎల్బీసీ, సుంకిశాల, పంప్‌ హౌస్‌ కొట్టుకుపోయినా విచారణ లేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -