Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్‌సీయూ భూములొద్దు

హెచ్‌సీయూ భూములొద్దు

- Advertisement -

– పునరాలోచనలో ప్రభుత్వం
– డీమ్డ్‌ ఫారెస్ట్‌గా కంచ గచ్చిబౌలి ప్రాంతం
– నిపుణుల కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రాజకీయంగా, న్యాయపరంగా ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో దీనిపై వెనకడుగు వేయడమే మంచిదనే అభిప్రాయాన్ని రాష్ట్ర మంత్రివర్గం గతంలోనే వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడంతో, భవిష్యత్‌లో హెచ్‌సీయూ భూముల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. సుప్రీం పర్యవేక్షణలోనే ప్రత్యేక నిపుణుల కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ విచారణ పూర్తి అయినా, ఇంకా న్యాయస్థానానికి నివేదిక ఇవ్వలేదు. ఈ దశలో కంచ గచ్చిబౌలి భూముల్ని డీమ్డ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదీ వివాదం
కంచ గచ్చిబౌలి సర్వేనెంబర్‌ 25లోని 400 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో జీవో నెంబర్‌ 54 ద్వారా తెలంగాణ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ)కి అప్పగించింది. ఆ సంస్థ ఓ మధ్యవర్తి కంపెనీ ద్వారా భూములను తనఖా పెట్టి బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్ల మొత్తాన్ని సేకరించింది. సంబంధిత స్థలంలో ఐటీ, ఇతర పరిశ్రమల కోసం భూమిని అమ్మడం లేదా కేటాయింపులు చేయాలని టీజీఐఐసీ నిర్ణయించింది. దానికోసం భూమిని చదును చేసేందుకు అక్కడున్న చెట్లను తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటవీ, వాల్టా చట్టాలను ఉల్లంఘించిందనీ, ఆ భూములు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందినవనే వివాదం చెలరేగింది. దీనితో ఈ భూములపై తెలంగాణ హైకోర్టు, సుప్రీకోర్టుల్లో కేసులు పడ్డాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ అంశంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కంచగచ్చిబౌలి ప్రాంతంలో పర్యటించి విచారణ జరిపింది.
కమిటీ ఏర్పాటు
పర్యావరణం, అటవీభూముల గుర్తింపున కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి (సీసీసీఎఫ్‌) డాక్టర్‌ సువర్ణ చైర్‌ పర్సన్‌గా ఆరుగురు సభ్యులను కమిటీలో నియమించారు. వైల్డ్‌ లైఫ్‌ నిపుణులు, రిటైర్డ్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శంకరన్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎస్‌ఆర్‌ఎస్‌ఎ) చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) ప్రతినిధి, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మాధవరావు, ఖమ్మం జిల్లా అటవీ అధికారి, రాజన్న జిల్లా అటవీ సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారుల్ని కమిటీలో నియమించారు.

డీమ్డ్‌ ఫారెస్ట్‌ అంటే…

‘డీమ్డ్‌ ఫారెస్ట్‌’ అంటే అటవీ ప్రాంతంగా కనిపించే భౌతిక ప్రాంతాలు. కానీ అవి అధికారికంగా అటవీ భూముల రికార్డుల్లో నమోదై ఉండవు. 1996లో టి.ఎన్‌.గొదవర్మన్‌ తిరుముల్పాడ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టపరమైన హౌదా ఆధారంగా కాకుండా, పర్యావరణ పరంగా అడవులను పోలి ఉండే భూములను
డీమ్డ్‌ ఫారెస్ట్‌ అంటారు. ఇందు కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని గుర్తించి, సంరక్షించాలని సుప్రీం ఆదేశించింది. చెట్ల సాంద్రత, వృక్ష, జంతు జాతులు, అరుదైన జీవవైవిధ్యం తదితర అంశాల ఆధారంగా వాటిని డీమ్డ్‌ ఫారెస్ట్‌లుగా ప్రకటించాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -